You are here
Home > Latest News > అదిగో సుందర భద్రాద్రి …

అదిగో సుందర భద్రాద్రి …

Spread the love
  • అద్భుతమైన పుణ్యక్షేత్రంగా భద్రాద్రి…
  • దేశంలోనే నెంబర్‌వన్‌గా భద్రాద్రి, ఎయిర్‌పోర్ట్, వంతెన నిర్మాణం
  •  కొత్తగూడెం నుంచి భద్రాచలానికి రైలుమార్గం
  • గర్భగుడికి ఆటంకం లేకుండా నిర్మాణాలు
  • నమూనాలను పరిశీలించి సూచనలు చేసిన సీఎం కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో.. మన ఆలయాలు.. మన చరిత్ర.. మన కీర్తి.. అంతా గతమెంతో ఘనం అన్న తీరుగానే ఉన్నాయి. కానీ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు మెల్లగా మారిపోతున్నాయి. మన యాదాద్రి నారసింహుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. నవ నారసింహ క్షేత్రాలు నిర్మిస్తూ.. యాదాద్రిని అపూర్వ పుణ్య క్షేత్రంగా అత్యాధునిక వసతులతో.. తీర్చిదిద్దుతున్నారు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్.

అలాగే.. వేములవాడ రాజన్న ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్ది.. భక్తులకు మరో కైలాసాన్ని దర్శించుకునే అనుభూతిని అందించేందుకు పరితపిస్తూ.. భారీ స్థాయిలో నిధులు కేటాయించిన ఘనత మన కేసీఆర్ దే. అందుకే.. ఇప్పుడు వేములవాడ ఆలయంలో ఎటు చూసినా.. అభివృద్ధికి సంబంధించిన పనులు కనిపిస్తున్నాయి. దీంతో.. రాజన్న భక్తులు కూడా.. సంభ్రమాశ్చర్యాలకు, ఆనందానుభూతులకు లోనవుతున్నారు.

అంతేనా.. మన ఆలయాలను.. మన భగవంతుళ్లను, మనదైన చరిత్రను అక్కడితో ఆపేశారా? నో నెవ్వర్. తెలంగాణకే తలమానికమైన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా.. కేసీఆర్ అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇదే ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు అప్పగిస్తే.. ఈ పాటికి పోలవరం ప్రాజెక్టులో కలిపేసేవారేమో అని జనం కూడా అంటుంటారు. కానీ.. మన కేసీఆర్ మాత్రం.. ఆ పరిస్థితి రానీయకుండా.. ఆ దుస్థితి భద్రాద్రి రాముడి చెంతకు దరి చేరకుండా అడ్డుకుంటున్నారు.

అభినవ రామదాసుగా మారి.. భద్రాద్రి రామాలయ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి ఉత్తర, పడమర దిక్కున ఉన్న స్థలాలు కూడా కలుపుకుని.. మొత్తం 30 ఎకరాల్లో గుడిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే.. భద్రాద్రికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తూ.. కొత్తగూడెం తర్వాత నుంచి 4 లైన్ల రోడ్లు సౌకర్యం వేయడం మాత్రమే కాక.. అక్కడి నుంచి భద్రాద్రి వరకూ విమాన ప్రయాణ సౌకర్యం కల్పించే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు.

అంతే కాదు. గోదావరిలో ఎప్పుడూ నీళ్లు నిలవ ఉండేలా ప్రాజెక్టులు వస్తున్నాయని ఉన్నతాధికారుల రివ్యూలో చెప్పిన ముఖ్యమంత్రి.. భక్తులకు పడవ ప్రయాణ సౌకర్యం కూడా అందబోతోందని తెలిపారు. గోదావరిపై మరో వంతెన కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ఇలా.. భద్రాద్రిని సకల హంగులతో ముస్తాబు చేస్తూ.. భక్తులకు మరో అయోధ్యగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు.

ఇంకా అయిపోలేదు. మన సంస్కృతిని.. మన సనాతన విధానాలను ముందుకు తీసుకుపోతూ.. హిందూ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి.. అమ్మవారి కరుణకూ పాత్రులు అవుతున్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి ఆలయాల తరహాలోనే.. చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేద్దామని.. అందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని ఉన్నతాధికారులను, మంత్రులను ఆదేశించారు. త్వరలోనే.. తన పర్యవేక్షణలోనే ఆ పనులు మొదలు పెడతామన్న సంకేతాలు ఇచ్చారు.

ఇంతే కాదు.. ఒక్క హిందూ సంస్కృతిని మాత్రమే కాదు.. అటు రంజాన్ ను అధికారికంగా నిర్వహిస్తూ.. ముస్లిం సోదర సోదరీమణుల మనోభావాలు గౌరవిస్తున్న ముఖ్యమంత్రి.. ఇటు క్రిస్మస్ ను కూడ అంతే సంబురంగా నిర్వహిస్తూ.. క్రైస్తవ సోదర సోదరీమణుల ఆనందానికీ కారణమవుతున్నారు. ఇలా.. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూనే.. ఇతర మతాలకూ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజలంతా సర్వమత సమ్మేళనంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Top