You are here
Home > Latest News > అయిపోయింది.. ఉత్తమ పదవి ఊడబోతోంది!

అయిపోయింది.. ఉత్తమ పదవి ఊడబోతోంది!

Spread the love

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం దగ్గర పడింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల పేరుతో ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాల తీరు.. అంతగా అనుకున్నంతగా ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హై కమాండ్ ఆయన మీద గుర్రుగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు.. తన అనుకూల సోషల్ మీడియాతో.. పీసీసీ చీఫ్ పదవికి ఎలాంటి ఇబ్బంది లేదని.. ఉత్తమ్ చీప్ గా ప్రచారం చేసుకుంటున్నా.. తెర వెనక మాత్రం ఆయన సీటుకు ఎసరు పెట్టే ప్రయత్నాలు జోరుగానే నడుస్తున్నాయి.

ఇప్పటికే.. పీసీసీ చీఫ్ పై.. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డితో పాటు.. మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ.. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రమే కాక.. బహిరంగంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే.. కనీసం ఐదారు సీట్లు కూడా గెలిచే అవకాశాలు లేవని కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. అలాగే.. పార్టీ కార్యకర్తలు కూడా.. ఉత్తమ్ నాయకత్వంపై గుస్సాతో ఉన్నారు.

ప్రభుత్వంపై పోరాటంలో పక్కా ప్రణాళిక లేదని.. నేరేళ్ల ఘటన లాంటి విషయాల్లో అనవసరంగా ఎక్కువ చేసి.. ఎలాంటి ఫలితం సాధించలేకపోయామని కేడర్ అంటోంది. రైతు సమన్వయ సమితులపై విమర్శలు చేస్తున్న తీరుతో రైతుల్లో కాంగ్రెస్ పై మరింతగా వ్యతిరేకత పెరుగుతోందని లీడర్లు అంటున్నారు. దీనికి అంతటికీ కారణం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం తీరే అని స్పష్టం చేస్తున్నారు. పక్కా ప్రణాళిక లేకుండా.. ప్రభుత్వంపై పోరాటం అని ఆవేశంగా డైలాగులు చెబితే.. అనుకున్న ఫలితం వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో కూడా… పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడం ఖాయమని.. ఇంకా చెప్పాలంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదో అన్న అనుమానం కూడా ఉందని లీడర్ నుంచి కేడర్ వరకూ అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి.. పార్టీని మరింతగా పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న రిపోర్ట్ ను.. హై కమాండ్ కు పంపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే పరిగణిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం.. త్వరలోనే ఉత్తమ కుమారుడి భవితవ్యాన్ని తేల్చే పనిలో పడినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు తగిన వారసుడిని వెతికే పనిలో ఉన్న కారణంగానే.. ఇప్పటికిప్పుడు ఆ విషయాన్ని బయటికి రానీయడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన.. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డట్టే.. అన్న మాట.. కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Top