You are here
Home > Latest News > అయోమయం..!

అయోమయం..!

Spread the love
  • మొన్న నల్లగొండ నియోజకవర్గం వీడేది లేదన్న కోమటిరెడ్డి
  • తాజాగా తాను పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని వెల్లడి 
  • నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్ బీసీ నేతకు ఇస్తారంటూ ప్రచారం
  • ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కాంగ్రెస్ 
  • తమ బలోపేతంతోనే భయం పట్టుకుందంటున్న టీఆర్‌ఎస్

వారం రోజులు తిరగక ముందే విభిన్న ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు ఆ పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నది. నల్లగొండ నియోజకవర్గాన్ని వీడేది లేదంటూ నాలుగు రోజుల కిందట ప్రకటనలో తేల్చి చెప్పిన కోమటిరెడ్డి.. తాజాగా సోమవారం వేములపల్లిలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్‌ను బీసీ నేతకు ఇచ్చేందుకు ఆలోచిస్తుండడమే కోమటిరెడ్డి తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తుండగా.. రోజురోజుకూ నల్లగొండలో తమ బలం పెరుగుతుండడం కాంగ్రెస్ నేతల్లో ఆందోళనను కలిగిస్తోందని..వెంకటరెడ్డి నిర్ణయమే అందుకు నిదర్శనమని టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్తున్నాయి.

వేములపల్లిలో..
మిర్యాలగూడ ఎమెల్యే టిక్కెట్ ఓ యువకుడికి ఇప్పించే విధంగా అధిష్ఠానాన్ని కోరుతాం. అవసరమైతే నల్లగొండ నుంచి కూడా యువకుడికి అవకాశం కల్పించి.. నేను పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తా. మీ అందరికీ అండగా ఉంటా.

నాలుగు రోజుల కిందట.. ప్రాణం ఉన్నంత వరకు నల్లగొండను వదిలేది లేదని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా అవసరమైతే తాను నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే టిక్కెట్ యువకుడికి కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతానన్నారు. అవసరమైతే నల్లగొండలోనూ యువకుడికి అవకాశం కల్పించి తాను నల్లగొండ పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తానని.. మీకు అండగా ఉంటానని సభా ముఖంగా చెప్పారు. 1999నుంచి వరుసగా నాలుగుసార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా..? అదే నిజమైతే తాను నల్లగొండలోనే పోటీ చేస్తానని ఎందుకు ప్రకటించారు..? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌నే అయోమయానికి గురి చేస్తున్నాయి.

మునుగోడుకు వెళ్తారని ముందుగా ప్రచారం…
జిల్లా కేంద్రంలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభకు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ పెద్దలంతా హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ఆ సభ ముగిసిన మరుసటి రోజు నుంచీ నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్‌ను శ్రీనివాస్ భార్య, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మికి కేటాయిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. కోమటిరెడ్డి మునుగోడు నుంచి లేదా నల్లగొండ పార్లమెంటుకు పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 8న… తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, తన ప్రాణం ఉన్నంత వరకు నల్లగొండ నియోజకవర్గంలోనే ఉంటానని ఓ ప్రకటనలో స్పష్టంగా తెలిపారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కానీ తాజాగా వేములపల్లిలో నల్లగొండ ఎంపీగా తాను పోటీ చేస్తానని చెప్పడం.. ఏదో ఒక సంచలన ప్రకటనతో వార్తల్లో ఉండడం కోసం చేసిన వ్యూహమేనా? లేకపోతే నిజంగానే ఆ దిశగా ఆలోచిస్తున్నారా? ఒకవేళ నిజమే అయితే నల్లగొం డను కోమటిరెడ్డి ఎందుకు వదులుకుంటున్నారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో తిరుగుతున్నాయి.

కోమటిరెడ్డిని వ్యూహాత్మకంగా ఇరికించారా..?
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పటికీ అంతో ఇంతో పట్టు కలిగి ఉన్న ప్రస్తుత నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని వదులుకొని ఎంపీగా పోటీ చేసేందుకు కోమటిరెడ్డి ఎందుకు ఆలోచిస్తున్నారనే ప్రశ్నలతో పాటే కాంగ్రెస్ శ్రేణుల నుంచి పలు విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను సైతం గతంలో కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలను మనసులో పెట్టుకున్న పార్టీ పెద్దలు.. ఇటీవల పార్టీ పరంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే నల్లగొండకు వచ్చారని అంటున్నారు. కోమటిరెడ్డిని వ్యూహాత్మకంగా ఇరికించాలనే ఉద్దేశంతోనే.. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో అతని భార్య లక్ష్మికి నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తే బీసీ ఓట్లు రాబట్టుకోవడంతోపాటు పార్టీలో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కుటుంబానికి అండగా ఉన్నట్లుగా ఉంటుందని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం.

ఢిల్లీ పెద్దలు సైతం ఈ నిర్ణయంపై సానుకూలంగా ఉన్నట్లు తెలియడం తోనే.. ఎంపీగా పోటీ చేయాలని కోమటిరెడ్డి నిర్ణయించుకున్నట్లు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేసి.. నల్లగొండ అసెంబ్లీ నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తానని సోమవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం నల్లగొండలో తమ పార్టీ బలోపేతంతోనే కోమటిరెడ్డి బెదిరిపోయి కొత్త నిర్ణయం తీసుకున్నారని అంటున్నాయి.

Top