You are here
Home > Latest News > అరుణమ్మా.. ఇలా మాట్లాడితే.. ఉన్న పరువు కూడా పోతుంది జాగ్రత్త!

అరుణమ్మా.. ఇలా మాట్లాడితే.. ఉన్న పరువు కూడా పోతుంది జాగ్రత్త!

Spread the love

ఇప్పటికే రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గద్యాలలో మీ అడ్రస్ కూడా.. మీ కార్యకర్తలు మరిచిపోయేలా ఉన్నారు. ఎందుకమ్మా అరుణమ్మా మీకు.. ఇలాంటి తప్పుడు రాజకీయాలు? కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని ఎవరూ బయటికి రావాలని పిలవడం లేదు కానీ.. ప్రజల పక్షాన మీకు ఓ సలహా ఇవ్వదలుచుకున్నాం. బయట ప్రజలు ఏం చెబుతున్నారంటే.. మీ తోటి కాంగ్రెస్ నేతల వాసన మీకు అంటినట్టుంది. అందుకే.. మీరు కూడా ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ముందు.. వాళ్లకు కాస్త దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి.

గతంలో మీ పార్టీ ఎన్నేళ్లు అధికారంలో ఉందో మీకు తెలియనది కాదు. అప్పుడెప్పుడూ.. మహిళలకు చీరలు పెట్టి గౌరవించాలన్న ఆలోచన రాని విషం మీకు తెలియనది కాదు. ఆడబిడ్డల పండగ అయిన బతుకమ్మను సంబురంగా చేద్దామన్న దిశగా కూడా మీరు కనీస ప్రయత్నాలు చేయలేదనీ మీకు తెలుసు. అలాంటపుడు.. ప్రతి పేదింటి ఆడబిడ్డకూ.. బతుకమ్మ చీరను కానుకగా అందివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తపన పడితే.. దాన్ని మహిళగా స్వాగతించాల్సింది పోయి.. ఇలా తప్పుబడతారేంటమ్మా.. మరీ అసహ్యంగా!

మీరు కూడా చీరలు కొంటుంటారు కదా. మీకు తెలిసిన ఇతర మహిళలు కూడా కొంటుంటారు కదా. మీరు కానీ.. మీ వాళ్లు కానీ కొనే వందల వేల చీరల్లో ఎన్నడూ ఒక్కటంటే ఒక్కటి కూడా డ్యామేజ్డ్ చీర వచ్చిన సందర్భాలే లేవా? మీకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి.. అవసరమైతే దగ్గరుండి పనిమనుషుల్ని పెట్టి చీరలు నేయించుకుంటారేమో. కానీ.. పేదలు కొనుక్కునే చీరల్లో ఎక్కడో ఓ దగ్గర.. ఎప్పుడో ఒకప్పుడు కాస్త లోపాలు కనిపిస్తుంటాయి. అలాంటి సమస్యే ఇక్కడ కూడా వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా కోటి చీరలు పంపిణీ చేసే లక్ష్యం ప్రభుత్వానిది.

52 లక్షల చీరలు ఇక్కడ తయారు చేయిస్తే.. మిగతావి బయటినుంచి తెప్పించారు. ఇంత తక్కువ సమయంలో.. అన్ని చీరల నాణ్యతను పరిశీలించడం సాధ్యమయ్యే పనేనా? పోనీ వందలు వేల చీరలు పాడైనట్టు ఏమైనా జరిగిందా? రెండు మూడు చోట్ల.. నాలుగైదు చీరలు కాస్త తక్కువ నాణ్యమైనవి వస్తే.. మొత్తం పథకానికే మకిలి అంటేట్టు మాట్లాడుతున్న తీరు చాలా దారుణంగా ఉందమ్మా. మీరే కాదు.. మీ పార్టీ రాష్ట్ర చీఫ్ సతీమణి పద్మావతీ ఉత్తమ్ కూడా ఇదే తీరున మాట్లాడుతున్నారు. పార్టీ వేరు కావొచ్చు. మీరు ప్రభుత్వంలో లేరు కావొచ్చు. కానీ.. మీరు కూడా సాటి మహిళలే.

ముందు ఓ బాధ్యతాయుత మహిళగా ఆలోచించండి. ఆ తర్వాతే.. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న చీరల పంపిణీపై మాట్లాడండి. అంతే కానీ.. ఉన్నవీ లేనివీ పుట్టించి.. పేదింటి ఆడబిడ్డలను మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి.

Top