You are here
Home > Latest News > ఆత్మహత్య చేసుకున్న రైతులకు భరోసా కల్పించాం – ముఖ్యమంత్రి కేసీఆర్

ఆత్మహత్య చేసుకున్న రైతులకు భరోసా కల్పించాం – ముఖ్యమంత్రి కేసీఆర్

Spread the love

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలకు సీఎం ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవవ శుభాకాంక్షలు. చారిత్రక గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జాతీయ జెండా ఎగురవేసినందుకు గర్విస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

ఏ రైతైనా ఏ కారణంగానైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దని  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం కేసీర్ . ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి, భరోసా కల్పించేందుకు,  రైతు బీమా పథకాన్ని ఇవాళ్టి నుంచి అమల్లోకి ప్రభుత్వం తెస్తోందన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున రైతులకు బీమా సౌకర్యం కల్పించిన  ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. భారత జీవిత బీమా సంస్థ – ఎల్.ఐ.సి. ద్వారా ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ప్రతీ ఏటా చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రైతుల  తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. 5లక్షల బీమా మొత్తం  రైతు మరణించిన పది రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబానికి అందించే విధంగా ఈ  పథకాన్ని  ప్రభుత్వం రూపొందించిందన్నారు.

నకిలీ విత్తనాలు,  కల్తీ ఎరువులు, కల్తీ  పురుగు మందులు వ్యవసాయానికి శాపంగా మారిన దశలో వీటిని  అరికట్టేందుకు ప్రభుత్వం చట్టాలను  కఠినతరం చేసిందన్నారు. కల్తీ నేరాలన్నిటినీ పిడి యాక్టు పరిధిలోకి తీసుకువచ్చి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నకిలీ విత్తనాలు తయారుచేస్తున్న ఐదు కంపెనీలపై  పీడీయాక్ట్ నమోదు చేసి… ఆ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుందన్నారు. కల్తీ విత్తనాలు పంపిణీ చేస్తున్నందుకు 135 మంది డీలర్ల లైసెన్స్‌ల తో పాటూ, తొమ్మిది సెంట్రలైజ్డ్ సీడ్‌లైసెన్స్‌లను ప్రభుత్వంరద్దు చేసిందన్నారు. రానున్న రోజుల్లోనూ రైతాంగం ప్రయోజనాలు రక్షించే విషయంలో ఇదే విధంగా రాజీ లేని వైఖరితో ముందుకుపోతామని… కల్తీ వ్యాపారాలను ఉక్కుపాదం మోపి అణిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని ప్రకటించారు సీఎం కేసీఆర్.

దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ అద్భుతం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా నిబద్ధతతో కృషి చేసిందన్నారు. తెలంగాణా ఏర్పడితే చిమ్మ చీకట్లే అన్నవాళ్ళ అంచనాలను ప్రభుత్వం తలకిందులు చేసిందన్నారు. వ్యవసాయానికి మొదట 9 గంటలు విద్యుత్ అందేట్టు చేసి, ఈ ఏడాది జనవరి ఒకటి నుండి 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

తెలంగాణలో వ్యవసాయరంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసింది. ప్రతీ క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించడంతోపాటు, రైతు వేదికలను కూడా నిర్మిస్తుంది. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి ఈ వేదికలు గొప్పగా  ఉపయోగపడతాయి.

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు 50 నుంచి 90 శాతం సబ్సిడీపై ఇప్పటి వరకు రైతులకు 14వేల ట్రాక్టర్లు అందించింది.  ఇతర ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులకు సబ్సిడీపై వరినాటు యంత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది మండలానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,500 వరినాటు యంత్రాలు పంపిణీ చేస్తున్నాం. తక్కువ నీటి తో  ఎక్కువ పంట తీయడానికి ఉపయోగ పడే డ్రిప్ ఇరిగేషన్ ను ప్రభుత్వం  ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బిసిలకు  చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. చిన్న, సన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ  పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాలీ హౌస్, గ్రీన్ హౌస్ లను  ఏర్పాటు చేసుకునేందుకు చిన్న సన్న కారు రైతులకు  ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తున్నది. రాష్ట్రంలోపాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ పెరిగింది.

రైతాంగం సంఘటితమైతే తమ సమస్యలు తామే పరిష్కరించుకోగలుగుతారు. సంఘటిత శక్తిలోని బలం రైతులకు తెలియజేయడం కోసం  దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమితులు విత్తనం వేసే దగ్గరి నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, అన్ని దశల్లోనూ రైతుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తాయి.

అధికార వ్యవస్థలలో అన్ని స్థాయిలలో సామాజిక న్యాయం అమలు కావాలని ప్రభుత్వం భావిస్తున్నది. దేశంలోనే మొదటి సారిగా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్  విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  దీంతో SC,ST,BC మహిళా వర్గాల్లోని రైతులకు మార్కెట్ చైర్మన్లు అయ్యే హక్కును ప్రభుత్వం కల్పించింది.

పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా  రైతులు ధాన్యం  నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తరువాత 364 గోదాములు నిర్మించింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో గోదాముల్లో నిల్వ సామర్థ్యం 22.47 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 3,285 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే,న వాటి సంఖ్యను 6,028 కి ప్రభుత్వం పెంచింది. సిసిఐ కేంద్రాల సంఖ్యను 41 నుంచి 243కి పెంచింది. మక్కల కొనుగోలు కేంద్రాల సంఖ్యను 165 నుంచి 379 కి పెంచింది.

భూ వివాదాలను  శాశ్వతంగా పరిష్కరించడం కోసం,భూ రికార్డుల  నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది.  భూ రికార్డుల సమగ్ర  ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కృషితో  దాదాపు 94 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల  క్రయ విక్రయాలకు చట్టబద్ధత కోసం   ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. భూముల  రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై  వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ రికార్డుల నిర్వహణలో  పారదర్శకత కోసం  ‘ధరణి’ వెబ్ సైట్ కు రూపకల్పన చేసింది.

రైతును వేధిస్తున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలానే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పంట కాలంలో రైతులు పెట్టుబడి  లేక, అప్పుల కోసం చేయిచాస్తున్నరు. రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని “ రైతుబంధు” పేరు తో  అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది.  రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు  ఎకరానికి 4000 రూపాయల చొప్పున రెండు పంటలకు కలిపి 8000 రూపాయలు ఈ పథకం ద్వారా అందిస్తున్నది. రైతు బంధు  చెక్కుల పంపిణీ పల్లెలలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. పంట కాలంలో  పెట్టుబడి సహాయం కోసం ఎకరానికి నాలుగువేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల మంది రైతులకు 5,111 కోట్ల రూపాయలను ప్రభుత్వం  పంపిణీ చేసింది. ఇంత భారీ బడ్జెట్ నేరుగా రైతుల చేతికి  అందించటం దేశ  చరిత్రలో ఇదే మొదటిసారి.  వచ్చే నవంబర్ మాసంలో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నద్దంగా ఉన్నదని రైతు సోదరులకు సంతోషంగా తెలియజేస్తున్నాను. రైతుబందు పథకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది.

Top