You are here
Home > Latest News > ఈ కుహనా మేధావులే తెలంగాణకు శాపం.

ఈ కుహనా మేధావులే తెలంగాణకు శాపం.

Spread the love

అయ్యా మేధావులారా!నిజమే మౌనం ప్రమాదకరమే,నోరు తెరవాల్సిందే,ప్రశ్నించాల్సిందే,కాని ఎప్పుడు అన్నది కూడా ముఖ్యమే,అన్యాయం జరుగుతున్నప్పుడు,వివక్ష స్పష్టంగా కంటికి కనిపిస్తున్నప్పుడు,విచ్చలవిడి జల దోపిడీ జరుగుతున్నప్పుడు,అక్రమ ప్రాజెక్టులు యథేచ్చగా నిర్మాణం జరుగుతున్నప్పుడు,అప్పుడు ప్రశ్నించాల్సిన మీరు ఎందుకోగాని నోరు విప్పలేదు,మీ నోళ్ళు పెగల్లేదు.అటు బాబ్లీ,ఇటు పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్నప్పుడు,నల్లగొండ ప్రజలుస్వచ్చమైన తాగునీటి కొరకు తపిస్తున్నప్పుడు మీరందరూ ఏ కలుగులో దాక్కున్నారు.అప్పుడు ఎందుకని ప్రశ్నించలేదు.

ఇప్పుడు మీకు పాలమూరు నీటి రంది పట్టుకున్నది.మీ దృష్టిలో తెలంగాణ పాత పది జిల్లాల లేదా నూతన ముప్పై ఒక్క జిల్లాల సమాహారం.తెలంగాణ అంటే  మీ దృష్టిలో ముప్పై ఒక్క అతుకుల బొంత,ఈ మాట హరగోపాల్ గారే స్వయంగా సెలవిచ్చారు.ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లా విడదీసి చూసే స్వభావం మీది.అందుకే మీకు తెలంగాణ విశాల ప్రయోజనాల కన్నా జిల్లాల వారి ప్రయోజనాలే కనిపిస్తాయి.ఇదొ రకమైన సంకుచిత ధోరణి.జూరాల నుండి నీళ్ళు లిఫ్ట్ చేయాలన్న మీ ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకుండా శ్రీశైలం నుండి లిఫ్ట్ చేయడానికి నిర్ణయించింది.,అది మీకు జీర్ణం కాక,పాలమూరుకు ఏదో జరగకూడని నష్టం జరగబోతున్నది అన్నట్టు పెడబొబ్బలు పెడుతున్నారు.శ్రీశైలం లో అయితే వంద టీ.ఎం.సి నీళ్ళు ఉంటాయి,ఏడాది పాటు లిఫ్ట్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం భావిస్తున్నది.కేసీఆర్ ప్రభుత్వం దృష్టిలో పాలమూరు అయినా నల్లగొండ అయినా ఆదిలాబాద్ అయినా ఒకటే.ఇవన్నీ తెలంగాణ అభిన్న అంగాలు.మీలాగా కాలుకు కాలు,వేలుకు వేలు విడదీసి చూసే అంతటి తెలివితేటలు ఈ ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా విచారకరమే.

గోదావరి పరివాహక ప్రాంతం లో ఉన్న జిల్లాలకు గోదావరి నీళ్ళు,కృష్ణా పరివాహక ప్రాంతం లో ఉన్న జిల్లాలకు కృష్ణ నీళ్ళు లభించాల్సిందే.మీ లెక్క ప్రకారం గోదావరి నది మొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.మీ వాదన ప్రకారం ఆదిలాబాద్ కు సరిపోయినంత నీళ్ళను వాడుకున్న తరువాత మిగిలితే మిగతా జిల్లాలకు వదలాలి.ఇది ఎంత అసంబద్ధంగా,తర్క విరుద్ధంగా,మూర్ఖంగా ఉన్నదో ఆలోచించండి.సింపుల్ గా చెప్పాలంటే మీ ప్రవర్తన,మీ మాటలు జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి.పాలమూరు నీటి సమస్య అయినా,వలసల సమస్య అయినా,నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య అయినా ఇవి తెలంగాణ సమస్యలు,జిల్లాల సమస్యలు కావు.ఇక పాలమూరు నుండి వెళ్ళిన వారు తిరిగి వస్తున్నారు,అని ప్రభుత్వం చెబితే మీకు ఎగతాళిగా ఉన్నది.మేధావుల మౌనం ప్రమాదకరం అని విన్నాను,కాని మేధావుల మాట మరింత ప్రమాదకరం అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను.

Top