You are here
Home > Latest News > కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తా..

కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తా..

Spread the love

కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరే ఇతర పార్టీకి తెలియదని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం (అక్టోబర్ 12) ఆయన సూర్యాపేట పర్యటన సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రగతి సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనను జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి, ఎవరికి ఏ అవసరముందో తమకు అణువణువూ తెలుసనీ, అందుకే ప్రజలు తమను గెలిపించారని ఆయన అన్నారు.

లక్ష మంది ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు అడ్డుకున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టితీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నాం. ఖమ్మం, నల్లగొండలో వేలాది ఎకరాలను ముంచేసి పులిచింతల కట్టింన్రు. నిర్వాసితులకు మొక్కుబడిగా నష్టపరిహారం ఇచ్చారు. పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే నోరు మొదపని కాంగ్రెస్ నాయకులు ఇవాళ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రజల మేలు కోసం ఆ పార్టీ ఏనాడూ పనిచేయలేదు’ అని కేసీఆర్ మండిపడ్డారు.

‘నల్లగొండ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్నది పాత నల్లగొండ జిల్లానే. 60 ఏళ్ల చరిత్రలో ఏ నాయకులు చేయని పనిని మేం తలపెట్టాం. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొట్టమొదటి ఆల్ట్రా మెగాపవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణం నల్లగొండ జిల్లా దామరచర్లలో చేపట్టాం. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏడాదిన్నరలో పూర్తవుతాయి. దీంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి’ అని కేసీఆర్ అన్నారు.

‘కాళేశ్వరం పూర్తైతే.. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు నీళ్లొస్తాయి. త్వరలోనే నల్లగొండ రైతులు 3 లక్షల 20 వేల ఎకరాల్లో రెండు పంటలు పండించి మీసం మెలేస్తారు’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ అవసరముందో తనకు అణువణువూ తెలుసని తెలిపారు. మూసీ కాల్వల ఆధునికీకరణకు త్వరలో టెండర్లు ఆహ్వానిస్తున్నామని, 6 నెలల్లో మూసీ కాల్వ ఆధునీకరణ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును 365 రోజులు నింపే ఉంచుతామని చెప్పారు.

సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు దగా పడ్డాయని కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని, ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కి.మీ. ఎగువన ఏళేశ్వరం వద్ద నిర్మించడానికి మొదట ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు.

‘సమైక్యవాదులు మోసం చేసి ప్రాజెక్టును దిగువకు తరలించారు. దీంతో పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీరు కరువైంది. అనివార్యంగా ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తలెత్తింది. ఉద్యమ సమయంలో మునుగోడు, దేవరకొండ తదితర ప్రాంతాలను సందర్శించినప్పుడు కొన్నిచోట్ల కన్నీరు పెట్టుకున్నా’ అని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేసిందేమీ లేదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సూర్యాపేటకు కేసీఆర్‌ వరాలు జల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్‌లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలను మంజూరు చేస్తామన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15లక్షలు, తండాకు రూ.10 లక్షలు కేటాయిస్తామన్నారు.సూర్యాపేటలో బంజారా భవన్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పెంచాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Top