You are here
Home > Latest News > కాంగ్రెస్‌కు విజ‌యం క‌లే…

కాంగ్రెస్‌కు విజ‌యం క‌లే…

Spread the love

 

  • ఏఐసీసీ పెద్ద‌ల టూర్ల‌తో ఫ‌లితం శూన్యం
  • అన్ని జిల్లాల్లో వర్గపోరు
  • బ‌య‌ట‌ప‌డ్డ‌ విభేదాలు
  • పరిష్కరించేందుకు తంటాలు
  • ఫ‌లించ‌ని హైక‌మాండ్ వ్యూహం

 

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి చివ‌రిద‌శ‌లో ఉంది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్టు స‌ర్వేల‌న్నీ తేల్చిచెప్పాయి. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ఐఏసీసీ బాసులు బ్రెయిన్‌డెడ్ పార్టీని బ‌తికించుకోవ‌డానికి తంటాలు ప‌డుతున్నారు. అందుకే ఏఐసీసీ కార్య‌ద‌ర్శి స‌లీమ్ అహ్మ‌ద్ ఆదివారం హైద‌రాబాద్ వ‌చ్చాడు. స‌మావేశాలు పెట్టి రొటీన్ డైలాగులు దంచాడు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులంతా క‌ష్ట‌ప‌డితే కాంగ్రెస్‌కు అధికారం ఖాయ‌మ‌ట‌. బాబూ స‌లీమ్‌! మీ పార్టీలో కార్య‌క‌ర్త‌లు ఏమీ గానీ నాయ‌కుల ప‌రిస్థితే స‌క్క‌గ లేదు. ఒక్క జిల్లాలో కూడా మీవోళ్లు మంచిగ లేరు. అన్ని ప్రాంతాల్లో కొట్టుకుచ‌స్తున్న‌రు. నేనే సీఎం క్యాండెట్‌ను అంటూ డ‌బ్బ కొట్టుకుంటున్న‌రు. నీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానూ బోలెడు విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇంకొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కావాలా ? ఇవిగో..

ఒక్క చోట కూడా కాన‌రాని స‌ఖ్య‌త‌..

తెలంగాణవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లా చూసినా ప్రముఖ నాయకులకు కొదవే లేదు. మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ , కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైకి మాత్ర‌మే బలంగానే కనిపిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం లేక పార్టీ బలోపేతం కావడం లేదు. ఉదాహరణకు మహబూబ్‌ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, నాగం జనార్ధన్ రెడ్డితోపాటు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య… ఇలా ప్రతి ఒక్కరూ బలమైన నాయకులే.   నల్గొండ జిల్లా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.. వీళ్లకు అక్కడ రాజకీయంగా కొంత‌ పట్టుంది.  ఖమ్మం జిల్లా నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మాజీ మంత్తులు వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్ తదితర నేతలు ఉన్నారు. వీరికి తోడు రేగ కాంతారావు, ఎడవెళ్లి కృష్ణ, మానవతా రాయ్‌ తదితర నాయకులు ఉన్నారు. మెదక్‌ జిల్లా నాయకులు  మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పిఎసి చైర్మన్ గీతారెడ్డి, మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి సురేష్‌ షెట్కార్‌లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులకు అక్కడ కాస్త గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాలో మాజీమంత్రి ప్రస్తుతం మండలి విపక్ష నేతగా కొనసాగుతున్న మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ ఏసీ కార్యదర్శి మధుయష్కిగౌడ్ , మాజీ ఎమ్మెల్యే అనిల్ తదితర నేతలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో  మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి,  జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌ రెడ్డి తదితర నేతలు కొంత పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో సిఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆరేపల్లి మోహన్, కటకం మృత్యుంజయం, నేరెళ్ల శారద, రమ్యారావు,  గజ్జల కాంతం తదితర నేతలు ఉన్నా పెద్ద‌గా లాభం క‌నిపించ‌డం లేదు.

నాయ‌కులున్నారు.. పార్టీయే లేదు..

వరంగల్ జిల్లాకు వస్తే మాజీ పిసిసి అధ్యక్షులు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన నేత జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి, మహబూబాబాద్ నేతలు మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్‌, బెల్లయ్య నాయక్‌ తదితర నేతలు ఉన్నారు కానీ పార్టీ ఎక్క‌డా బ‌ల‌ప‌డ్డ సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌కు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి, మాజీమంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, దేప భాస్కర్‌ రెడ్డిలతో పాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్ తదితరుల నాయ‌క‌త్వం ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌టం లేదు.  హైదరాబాద్‌ నగరంలోనూ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీక వంటి బడా నేతలకు కొదవ లేదు. వీరిలో అత్యధికులు గతంలో పదవులు అనుభవించిన వారే. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.

కొంప‌ముంచుతున్న కొట్లాట‌లు….

ఇంత‌మంది నాయ‌కులు నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు కూడా లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ  ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మధ్య సమన్వయ లోపాలు, నిత్యం కుమ్ములాటలతో సతమతమవుతుంది. ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి సరిగ్గా పోతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో డీకే అరుణ వర్గం, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కరీంనగర్‌లో పొన్నం,  శ్రీధర్ బాబులు  రెండు వర్గాలుగా విడిపోయారు. మెదక్ జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గత నాలుగేళ్లుగా ఆయన పార్టీ గురించి పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో  మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఒక వర్గంగా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరో వర్గంగా కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లా విషయానికి వస్తే ముఖ్యనేతలు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తంకుమార్ రెడ్డి,కోమటిరెడ్డి బ్రదర్స్,  సిఎల్సీనేత జానారెడ్డి మూడు వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి అంటే రేణుక చౌదరికి పడదు. పొంగులేటి అంటే రేణుకకు గిట్టదు. ఈ ముగ్గురూ తరచూ ఘర్షణ పడుతుంటారనే ప్రచారం ఉంది. వీరంతా కొత్త నాయకులను ఎదగనీయరు పాత నాయకులను సంఘటితం చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాయకుల్లో సమన్వయ లోపం కారణంగా ఇప్పటివరకు ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో తెలియక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తలపట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా విషయానికి వస్తే గండ్ర వెంకటరమణారెడ్డి, దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి, నాయిని రాజేందర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి తదితర నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.

కానరాని ప‌రిష్కారం..

ఇలా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగానే ఉన్నా అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య విభేదాలు నాయకుల మధ్య సమన్వయ లోపం ఫలితంగా పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య విబేధాల కారణంగా సంస్థాగతంగా పార్టీ అభివృద్ధికి తోడ్పాటును అదించలేకపోతున్నారు. అధికార పార్టీ కన్నా బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీ పెద్దగా పుంజుకోవడం లేదని పార్టీ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకత్వాన్ని ఏకతాటిపై తేవడంతో హైకమాండ్‌ విఫలమవడం వల్లే కాంగ్రెస్‌ నానాటికీ దిగజారిపోతోందని కార్యకర్తలు అంటున్నారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, బలమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తారని చెబుతున్నారు. ఎంత మంది ఏఐసీసీ నాయ‌కులు వ‌చ్చినా, ఇది మాత్రం జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

 

 

 

 

Top