You are here
Home > Latest News > కేసీఆర్ పాలన.. దేశానికే ఆదర్శం!

కేసీఆర్ పాలన.. దేశానికే ఆదర్శం!

Spread the love

ఏ యేటికి ఆ యేడు.. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన.. కొత్త పుంతలు తొక్కుతోంది. అనుకున్న లక్ష్యాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడం.. వాటిని విజయవంతం చేయడం ఆయనకే చెల్లుతోంది. తన విజన్ లో మంత్రులను, అధికారులను భాగం చేయడంలో.. ఆయన చూపిస్తున్న చొరవ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అదే.. మన రాష్ట్రానికి అనేక రంగాల్లో అవార్డులను కూడా తెచ్చిపెడుతోంది. ఇతర రాష్ట్రాలు కూడా మన బాటలో నడిచేలా చేస్తోంది.

మిషన్ భగీరథ ఫలాలను ఇప్పటికే జనానికి అందించడం మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే ఏడాది చివరి నాటికి అనుకున్న పనులన్నీ పూర్తి చేసి.. రాష్ట్రంలోకి ఇంటింటికీ రక్షిత మంచి నీటిని అందించేదిశగా విజయవంతమైంది. అనేక రాష్ట్రాల నుంచి అధికారులు, మంత్రులు వచ్చి చూస్తూ.. చివరికి కేంద్ర మంత్రులు కూడా.. మిషన్ భగీరథను దేశానికే ఆదర్శంతమైన కార్యక్రమంగా కీర్తించడం.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇప్పటికే మూడు దశల్లో విజయవంతమైన మిషన్ కాకతీయ పథకం.. నాలుగో దశకూ సిద్ధమైంది. మరో 12 వేల చెరువుల్లో పూడిక తీతకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతల్లో పూడిక తీసిన చెరువుల కారణంగా.. లక్షల ఎకరాల ఆయకట్టులో సాగు బ్రహ్మాండంగా జరుగుతోంది. ముందు ముందు మన గొలుసు కట్టు చెరువుల సంస్కృతి సజీవంగా నిలిచేలా.. దేశానికే ఆదర్శంగా మిషన్ కాకతీయ నిరంతరంగా అమలవుతోంది.

పంచాయతీలను పరిపుష్టం చేస్తేనే.. రాష్ట్ర ఆర్థిక వృద్ధి సాధ్యం. గ్రామ స్వరాజ్యం సాధ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి.. కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసింది కూడా ఈ ఏడాదే. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే.. గ్రామాలు కూడా.. పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందడం ఖాయమన్న నమ్మకం.. అందరిలో కలిగింది.

మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలన్న సూత్రాన్ని అక్షరాలా పాటించే మన ముఖ్యమంత్రి కేసీఆర్.. వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పనులను స్పీడప్ చేసింది కూడా ఈ ఏడాదే. ఇది అందుబాటులోకి వస్తే.. వేలాది మంది చేనేత కార్మికులను డైరెక్ట్ గా ఉపాధి దొరకడంతో పాటు.. లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అందే అవకాశం కూడా ఉంటుంది.

ఇక.. ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేడయంలో సర్కారు గత ఏడాది కంటే మరింత చిత్తశుద్ధిని చూపిస్తోంది. ఇప్పటికే సీతారామ లాంటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేసి.. దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. కాళేశ్వరం ఎత్తిపోతలను కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు మంత్రి హరీష్ రావు నాయకత్వంలో శరవేగంగా అడుగులు వేస్తోంది. జల సిరులు కురిపించేందుకు అవసరమైన భూమిక పూర్తి చేస్తోంది.

కేవలం ప్రాజెక్టులు.. పథకాలు.. నీళ్లు.. నిధులు మాత్రమే కాదు. లక్ష నియామకాలతో.. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గురుకులాల్లో నియామకాల దగ్గర్నుంచి మొదలు పెడితే.. అన్ని విభాగాల్లో.. నియామకాలు పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 30 వేలకు పైగా నియామకాలకు చర్యలు తీసుకున్న సర్వీస్ కమిషన్.. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తోంది.

ఇంతేనా.. ఇంకా చాలా ఉన్నాయ్. కేసీఆర్ కిట్ తో గర్భిణులు, బాలింతలు, పసి కందులు లాభపడతున్నారు. హాస్టళ్లలో సన్న బియ్యం పథకం కొనసాగుతోంది. గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందుతోంది. వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రేపటి నుంచే 24 గంటల పాటు ఉచిత కరెంటు అందుబాటులోకి రాబోతోంది. వారికి మార్గదర్శకులుగా ఉండేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు.. రైతు సమన్వయ సమితులు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇలా.. రకరకాల పథకాలు.. వినూత్న కార్యక్రమాలతో.. సంక్షేమానికే 35 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ స్థాయి సమావేశాల నిర్వహణలోనూ తన ప్రత్యేకతను, చాతుర్యతను చాటుకుంటూ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

Top