You are here
Home > Uncategorized > కేసీయార్ విశ్వరూపం….

కేసీయార్ విశ్వరూపం….

Spread the love
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనలోని రాజకీయనాయకుడిని ఇంటిదగ్గర వదిలేసి తనలోని సాహిత్యమూర్తిని బయటకు తీశారు. అరగంటసేపు పైగా సాగిన కేసీయార్ ఉపన్యాసం ఆయనలోని పూర్వాశ్రమ లెక్చరర్ ను వెలికి తీసింది.
ఒకరకంగా చెప్పాలంటే నాకు డాక్టర్ సి నారాయణరెడ్డి గుర్తుకు వచ్చారు. అచ్చ తెనుగులో, తేట తెలుగులో సాగిన కేసీయార్ ప్రసంగంలో తెలంగాణ, ఆంద్ర, రాయలసీమలోని కవులు ఆవాహనం అయ్యారు. పోతన, వేమన, బద్దెన కవులు, సినారే, దాశరధి, కాళోజి, కేసీయార్ నోట కిన్నెరసానిలా జలజలా పారారు. సాహితీ సౌరభాలను విరజిమ్మారు. సాహ్యతసుగంధంతో పండుగ వాతావరణాన్ని తెచ్చారు. అది ఒక గ్రంథావిష్కరణ సభ ఏమో అనేట్లుగా సభకు జిలుగులు తెచ్చారు.
 
ఎక్కడా తడుముకోకుండా, తన చిన్నప్పటి గురువులు శర్మగారు, వీరభద్రయ్యగారి గూర్చి జ్ఞాపకాలను తడిమారు. వారికి నిజమైన శిష్యుడు అనిపించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ కూడా తన హోదాను పక్కన పడేసి తన వినయశీలతను, వినమ్రతను చాటుకున్నారు. పదుల సంఖ్యలో పద్యాలను ఆలపించారు. గోరెటి వెంకన్న, అందెశ్రీ లాంటి సమకాలీన కవులను స్మరించారు.
 
ఓహో… అది ఒక ముఖ్యమంత్రి ఉపన్యాసమా? ఒక ప్రొఫెసర్ చెప్పిన పాఠమా? కేసీఆర్ సాహిత్య పరిజ్ఞానం చూసి ఆహుతులు పరవశించిపోయారు. తెలుగుభాష వికాసం కోసం ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును కచ్చితంగా చదువుకునే జీవో ను తెచ్చినట్లు ప్రకటించి తెలుగుభాషకు కొత్త ఊపిరులు అందించారు.
 
ఈరోజు కేసీయార్ చేసిన ఉపన్యాసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప ఉపన్యాసం ఒక ముఖ్యమంత్రి నోట వినడం నేను ఇదే ప్రధమం. కేసీయార్ విరాట్ రూప ప్రదర్శన నేడు ఆవిష్కృతమైంది.
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
Top