You are here
Home > Latest News > కొత్త రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకునే తీరు ఇదేనా?

కొత్త రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకునే తీరు ఇదేనా?

Spread the love

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం నాలుగేళ్లు మాత్రమే కావొస్తోంది. అరవై ఏళ్ల దోపిడీ నుంచి.. ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. అలాంటి పసిగుడ్డును ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత.. తండ్రి స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రాలను సాకే కేంద్రంగా.. తెలంగాణకు అండగా నిలవాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానిదే. కానీ.. ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా పని చేస్తోంది.

ఒకవైపు.. కొత్త రాష్ట్రమైనా కూడా ఏ మాత్రం వెరవకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుంటే.. మరోవైపు నిధులు ఇవ్వకుండా.. కొర్రీలు పెడుతూ అభివృద్ధిని మోడీ సర్కార్ అడ్డుకుంటోంది. దేశంలోనే ఎక్కువ రెవెన్యూ సృష్టిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిస్తుంటే.. పన్నుల పేరుతో వేలకు వేల కోట్లు దండుకుంటున్న మోడీ ప్రభుత్వం.. తిరిగి ఆ స్థాయిలో సహాయం చేకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోంది.

రకరకాల పథకాలు అమలు చేస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు, కేంద్ర మంత్రులతో శభాష్ అనిపించుకుంటున్నా.. చివరికి బడ్జెట్ లెక్కలకు వచ్చే సరికి మొండి చేయి మాత్రమే ఎదురవుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. దేశంలో ఎక్కడా లేనటువంటి ఆదర్శవంతమైన పథకాలను అమలు చేస్తోంది. అయినా కూడా.. మోడీ సర్కారు మాత్రం తెలంగాణపై చిన్నచూపే చూస్తోంది.

ఇలా ఎందుకు అని ప్రశ్నిస్తే.. ఒక్క దానికీ సమాధానం దొరకదు. నిధులు ఎందుకు ఇవ్వరు అని అడిగితే.. వెటకారపు నవ్వు తప్ప మరే సమాచారమూ అందదు. ప్రాజెక్టులపై జీఎస్టీ వేయకండి మహాప్రభో అంటే.. లేఖ రాసివ్వండి అంటారు. లేఖ రాసిచ్చినా.. చెత్తబుట్టదాఖలు చేస్తారు. ఇలా.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న మోడీ ప్రభుత్వంపై సర్వత్రా నిరసనలు పెల్లుబుకుతున్నాయి.

కేంద్రం ఏ మాత్రం సహకరించకున్నా.. అద్భుత ఫలితాలు సాధిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతకు.. నీరాజనాలు అందుతున్నాయి.

Top