You are here
Home > Latest News > కౌలు రైతుల‌కు రైతుబంధు వ‌ర్తించ‌దు : సీఎం

కౌలు రైతుల‌కు రైతుబంధు వ‌ర్తించ‌దు : సీఎం

Spread the love

రైతుబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు.

ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుంది. ఏ రైతు అయినా తన భూమిని కౌలు దారుడికి ఇస్తున్నట్లు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి రైతుబంధు కచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలి. కౌలు రైతులకు సాయం అందించాలనే డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదు. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయడం మంచిది కాదని సీఎం అన్నారు. రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తుంది. కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాదు. ఇది రైతుబంధు పథకమే తప్ప.. కౌలు రైతుబంధు పథకం కాదన్నారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అధికారులు రైతులందరికీ సాయం అందించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు.

ఇతరులకు లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు?

రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పథకానికి బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించినం. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏడాదికి రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తోంది. శాసనసభ ఈ బడ్జెట్‌ను ఆమోదించింది. రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు.. ప్రభుత్వం గుర్తించిన ప్రతీ రైతుకూ సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్దికాలం కోసం లీజుకు ఇస్తారని.. అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కాదన్నారు సీఎం. ఇతరులెవరికీ లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు అమలు చేయాలన్నారు. రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నారు.

ఏ హక్కు, ఆధారం లేనివారికి సాయం ఎలా?

రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయాలనే డిమాండ్ అర్థరహితమైనది. ఆ వాదన న్యాయ సమ్మతం కూడా కాదు. కొందరు కౌలు రైతులకు రైతుబంధు కింద సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులను ఎలా విస్మరిస్తారని వాదిస్తున్నారు. ఆ డిమాండ్ అర్థరహితమైనది. ఆ వాదనలో న్యాయం లేదు. ఎందుకంటే అసలు కౌలు రైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గర కూడా కౌలు రైతుల వివరాలేవి లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తించలేదు. కౌలు రైతు అని చెప్పబడే వారికి భూమిపై ఎలాంటి హక్కులేదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశం ఉంది. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదు. కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమే కాక ప్రజాధనంతో కూడుకున్న అంశం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి అసెంబ్లీ ఆమోదంతో చేయాలి. ఆ ఖర్చుకు ఆడిట్ ఉంటుంది. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదు. ఏ హక్కూలేని, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నరు. ఇది న్యాయసమ్మతం కాదు. ఏ హక్కు లేని వారికి ఒకవేళ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తే తప్పవుతుంది. ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే ప్రశ్నించాలి. కానీ అంతా సవ్యంగా జరుగుతుంటే తప్పుపట్టడం సమంజసం కాదు. సమైక్య పాలనలో రైతులు చితికిపోయి నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Top