You are here
Home > Latest News > గ్రామాలను శుభ్రం చేసే పని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలి: సీఎం

గ్రామాలను శుభ్రం చేసే పని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలి: సీఎం

Spread the love

 

  • గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
  • వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని.. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచేలా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు.
  • ఇవాళ ప్రగతిభవన్‌లో మంత్రి జూపల్లి, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

 

ఈసందర్భంగా..గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు.

“గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలి. వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలి. రాబోయే 3 నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పని చేపట్టాలి. గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికి వేతనాలు పెంచాలి. వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా పంచాయతీలకు అప్పగించాలి. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుబడిన బావులను పూడ్చేయాలి. పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి.

కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి. మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి శుభ్రం చేయాలి. గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలి. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు పెంచాలి. గ్రామంలో పోగయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను పారబోయడానికి డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి. ప్రతీ గ్రామానికి ఒక శ్మశాన వాటిక నిర్మించాలి. స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్య పరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి. రాష్ట్రంలోని 12751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. గ్రామస్తులు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకొని దానికి అనుగుణంగా ఇండెంట్ తయారు చేసి, నర్సరీల్లో మొక్కలు పెంచాలి. దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రానీయని మొక్కలపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. రైతులు పొలం గట్ల మీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి.

గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలి. గ్రామ పరిధిలోని నదులు, ఉప నదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలి. అన్ని విద్యా సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. మొక్కలు నాటే విషయంలో డీఈవోలకు లేఖలు రాయాలి..” అని సీఎం తెలిపారు.

ప్రత్యేకాధికారులు ఏయే విషయాలు సేకరించాలో సూచించిన సీఎం

ఈసందర్భంగా ప్రత్యేకాధికారులు ఏయే విషయాలు సేకరించాలో సీఎం సూచించారు. అన్ని రకాల రోడ్లు కలిసి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి.. అవి ఏ పరిస్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలి. మురికి కాల్వల పొడవు, వాటి స్థితిగతులను నమోదు చేయాలి. స్మశాన వాటిక నిర్వహణ సరిగా ఉందా, లేదా కనుక్కోవాలి. గ్రామంలో శ్మశాన వాటిక లేకపోతే స్థలం సేకరించాలి. దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలి. దోబీఘాట్ లేకపోతే వెంటనే ఏర్పాటు చేయాలి. గ్రామంలో వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది.. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా తెలుసుకోవాలి.. అని సీఎం తెలిపారు.

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

అనంతరం రీజనర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌కు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగు రోడ్డు మామూలు రహదారిగా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలన్నారు. వరల్డ్ క్లాస్ ఎక్స్‌ప్రెస్ వేగా తీర్చిదిద్దే విధంగా డీపీఆర్ తయారు చేయాలన్నారు. నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడుతానని సీఎం స్పష్టం చేశారు.

Top