You are here
Home > Telangana > టీఎస్‌పీఎస్సీకి సర్కారు దన్ను

టీఎస్‌పీఎస్సీకి సర్కారు దన్ను

Spread the love

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఆటంకాల్లేకుండా భర్తీ ప్రక్రియను చేపట్టేలా అండగా నిలుస్తున్నది. తొంబై ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే కాకుండా డాటాసెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కొత్తగా 85 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొలువుల భర్తీలో శాఖలవారీగా కార్యాచరణను రూపొందించుకొని అమలుచేయాలని అధికారులను ఆదేశించి, టీఎస్‌పీఎస్సీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులు వారానికోసారి సమావేశమై, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నియామకాల విషయమై సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చర్చించారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక శాఖలవారీగా ఖాళీల భర్తీకి, కొత్త నియామకాలను చేపట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిందని, దీనిద్వారా ఇప్పటికే 58 నోటిఫికేషన్లు జారీచేశామని వివరించారు.

టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు ఐదువేల మంది నియమితులయ్యారని, మరోనెల వ్యవధిలో 12 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగుల కొరత ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. కొత్తగా 90 మందిని నియమించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు పనిభారం తగ్గించి, నియామకాల ప్రక్రియలో వేగం పెంచనున్నారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీని సాంకేతికంగా పటిష్ఠపర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీకి సాంకేతిక అవసరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అందిస్తున్నది. సీజీజీకి ఉన్న ఇతరత్రా పనిభారాల వల్ల సేవల్లో కొంత జాప్యం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి ప్రత్యేక డాటా కేంద్రం ఏర్పాటుకు కొద్దికాలం కిందటే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) ద్వారా కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నది. ఈ కేంద్రం ఏర్పాటుతో టీఎస్‌పీఎస్సీ సేవలు మరింత వేగంగా అందనున్నాయి.

Top