You are here
Home > Latest News > తెలంగాణ అంటే ఎందుకు బాబూ నీకింత కక్ష, పగ?

తెలంగాణ అంటే ఎందుకు బాబూ నీకింత కక్ష, పగ?

Spread the love

 

  • – రాష్ట్రం విడిపోయాక కూడా ఇన్ని కుట్రలు
  • – ప్రాజెక్టులు ఆపారు.. నీళ్లు దొంగిలించారు.. కరెంటు రాకుండా చేశారు
  • – అభివృద్ధి చూసి ఓర్వలేకనా? కేసీఆర్ గుర్తింపు భరించలేకనా?

అరవై ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఏనాడూ తెలంగాణ సంక్షేమానికి కాంగ్రెస్, టీడీపీ చిత్తశుద్ధితో పని చేయలేదు. రెండున్నర దశాబ్దాలకు పైగా చూస్తున్నాం. కొన్నాళ్లు చంద్రబాబు, తర్వాత వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య. ఇలా.. 2014 వరకూ దోచుకున్నవాళ్లే తప్ప.. గుండెల్లో దాచుకుని అభివృద్ధి చేసినవాళ్లే లేరు. వీరిలో వైఎస్ పైకెళ్లిపోయారు. రోశయ్య దాదాపుగా రాజకీయాల నుంచి రిటైరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడి ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయారు.

మిగిలిన చంద్రబాబు మాత్రం.. పదే పదే కుట్రలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడమే కాకుండా.. తర్వాత సీమాంధ్ర నేతల రాజీనామాల వెనక మంత్రాంగం నడిపించారన్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆ కుట్రలు ఫలించక.. తెలంగాణ ఏర్పడ్డ సమయంలోనూ ఏడు మండలాలు గుంజుకున్నారు. ఖమ్మం జిల్లాకు తీరని గుండెకోత మిగిల్చారు. తర్వాత.. కాళేశ్వరంపై దాదాపు వంద వరకూ కేసులు వేసి నిర్మాణాన్ని అడ్డుకునేలా చూశారు. అంతే కాదు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కట్టడాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వయానా కేంద్ర ప్రభుత్వానికీ లేఖ రాశారు… చంద్రబాబు.

అక్కడితో ఆగలేదు. ప్రతిసారీ శ్రీశైలం నీళ్లు, నాగార్జున సాగర్ నీళ్ల కోసం తగాదాలకు దిగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోల ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నా కూడా.. అవి కూడా తప్పేనంటూ వితండవాదం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1, ప్రాణహిత – చేవెళ్ల పథకాలపైనా ఫిర్యాదులు చేశారు. నదీ యాజమాన్య బోర్డులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తూ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.. చంద్రబాబు. మన ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో 184 కేసులు.. కాళేశ్వరంపై 88 కేసులు.. పాలమూరు – రంగారెడ్డిపై 35 కేసులు.. మిగిలిన ప్రాజెక్టులన్నీ కలిపి మరో 41 కేసుల వరకూ వేసిన దుర్మార్గుడు… చంద్రబాబు.

ఒకప్పుడు హైదరాబాద్ పేరు చెప్పుకొని తనను తాను నాయకుడిగా చిత్రీకరించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే పేరుతో అమరావతి నిర్మాణంలోనూ రాజకీయాలు చేస్తున్నారు. కనీసం తెలంగాణ కేంద్రంగా తనకు రాజకీయ గుర్తింపు వచ్చిందన్న కృతజ్ఞత కూడా ఆయన చూపెట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తల్లి పాలు తాగి రొమ్ము తన్నిన దాని కంటే మరీ హీనంగా దుర్మార్గంగా క్రూరాతి క్రూరంగా తెలంగాణ విషయంలో చర్యలు తీసుకుంటున్నారు.

ఎందుకింత కుట్రలు, ఎందుకిన్ని వేషాలు? చంద్రబాబుకు తెలంగాణ ఏం పాపం చేసిందని ఇంత కక్ష పెంచుకుంటున్నారు? అరవై ఏళ్ల పాటు జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి.. యువత ప్రాణ త్యాగాలు చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది? వాళ్ల ఉసురు తగిలేలా చంద్రబాబు ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఇప్పుడు తన శత్రువైన కాంగ్రెస్ తో పొత్తుకు ఎందుకు దిగజారాడు? మహా కూటమి పేరుతో మళ్లీ అధికారంలోకి రావాలని ఎందుకు తాపత్రయ పడుతున్నాడు? ఈ ప్రశ్నలకు చంద్రబాబే కాదు. కాంగ్రెస్ నేతలు కూడా సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే ఓట్లు అడిగేందుకు రోడ్డెక్కాలి. లేదంటే.. తెలంగాణ ప్రజానీకం మహాకూటమికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.

Top