You are here
Home > News > త్వ‌ర‌లో బ్యాంకు చెక్కులు ర‌ద్దు..?

త్వ‌ర‌లో బ్యాంకు చెక్కులు ర‌ద్దు..?

Spread the love
  • ప్రభుత్వం త్వరలో చెక్‌ బుక్‌లకు గుడ్‌బై చెప్పనుందా?
  • వ్యాపార వర్గాలకు ఈ మేరకు సంకేతాలు అందాయా?.
  • అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.
‘అఖిల భారత వ్యాపారుల సమాఖ్య’ (సిఎఐటి) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చెక్‌బుక్‌లను రద్దు చేసే అవకాశం ఉందని మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఖండేల్‌వాల్‌ చెప్పారు. ‘డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహం కోసం సమీప భవిష్యత్‌లోనే కేంద్ర ప్రభుత్వం చెక్‌ బుక్కుల సదుపాయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది’ అన్నారు.
ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీలు పెంచేందుకు మాస్టర్‌ కార్డు కంపెనీతో కలిసి ప్రారంభించిన డిజిటల్‌ రథ్‌ కార్యక్రమం ప్రారంభంలో ఖండేల్‌వాల్‌ ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం రూ.25,000 కోట్లు, వాటి రవాణా, భద్రత కోసం మరో రూ.6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దీనికి తోడు బ్యాంకులు క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై రెండు శాతం, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై ఒక శాతం చొప్పున వసూలు చేస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు సబ్సిడీ ఇస్తే, బ్యాంకులు ఈ చార్జిలు ఎత్తివేసే అవకాశం ఉందన్నారు.
Top