You are here
Home > Latest News > దేశం కోసం.. కేసీఆర్ నాయకత్వం వహించొద్దా?

దేశం కోసం.. కేసీఆర్ నాయకత్వం వహించొద్దా?

Spread the love

దేశాన్ని బాగు పరచాలని దక్షిణ భారత పరిధిలోని నేతలు అనుకోవద్దా? అది ఉత్తర భారత దేశ ప్రాంత నేతల హక్కు మాత్రమేనా? ఇన్నాళ్లూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు దేశాన్ని భ్రష్టుపట్టించారు. ఉత్తరాది భావజాలాలను దక్షిణాది వారిపై బలవంతంగా రుద్దుతూ.. కేవలం తమ రాష్ట్రాలనే అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అదే తీరును కనబరుస్తూ.. తమ అనుకూల రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు చేసుకుంటున్నారు తప్ప.. తెలంగాణ వంటి దక్షిణ భారత రాష్ట్రాలకు వారు చేసిందేమీ లేదు.

అందుకే.. కేసీఆర్ లాంటి జన నేతలు బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వివక్షకు చరమగీతం పాడేందుకు కేసీఆర్ లాంటి నాయకులు ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా వివరించారు. దేశానికి నాయకత్వం వహించేందుకు తమకు అర్హత లేదా అని ప్రశ్నించారు. ఆ అవకాశం వస్తే.. దేశం కోసం పని చేయాల్సి వస్తే.. మంచి మార్పును తీసుకువచ్చే అవకాశమే తనకు వస్తే.. నిస్సందేహంగా జాతీయ రాజకీయాల్లో తన సత్తా చూపిస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

అంతే కాదు.. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో మరో కొత్త వేదికకు తానే నాయకత్వం వహిస్తానని కూడా సీఎం అన్నారు. అదే జరిగితే.. మనమంతా గర్వపడేలా ఫలితాలు తీసుకొస్తానని కూడా నమ్మకంగా చెప్పారు. తన వయసు ఇప్పుడు 64 సంవత్సరాలన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు దేశం రాజకీయ మార్పు కోసం ఎదురు చూస్తోందని.. తనకు ఓపిక ఉన్నంత వరకూ దేశం కోసం పని చేస్తూనే ఉంటానని అన్నారు.

ఇప్పటికే.. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త వేదిక ఏర్పాటుపై చర్చలు కూడా మొదలైనట్టు చెప్పారు. చాలా మంది తన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారన్న సీఎం కేసీఆర్.. ఇంకా చర్యలు చేయాల్సి ఉందని.. పటిష్టమైన ఫార్ములాతో ముందుకు వస్తామని.. అందుకు ఇంకా సమయం కూడా ఉందని తేల్చి చెప్పారు. దీంతో.. జాతీయ పార్టీల నేతల గుండెల్లో వణుకు మొదలైంది. హిందీ, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ సాధించినట్టే.. దేశ రాజకీయాలనూ ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.

కేసీఆర్ నాయకత్వమే.. దేశ దశ దిశ మార్చుతుందన్న నమ్మకం కూడా.. రైతాంగం నుంచి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, యువతీయువకుల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది.

Top