You are here
Home > Latest News > ప్రతి ఎకరాకు సాగునీరు..ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రతి ఎకరాకు సాగునీరు..ముఖ్యమంత్రి కేసీఆర్

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగలకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు హెలికాప్టర్లలో పర్యటిస్తూ తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి, ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం, రాంపూర్ – పోతారం పంప్ హౌజ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పంప్ హౌజ్ పనులు జరుగుతున్న తీరును సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను లోతుగా అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌజ్ స్థలం వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో రైతులు ఇక భవిష్యత్ లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి ఉండకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావును, అధికారులను ఆదేశించారు.

రోహిణి కార్తెలోనే నాట్లు పడే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ – మార్చి లోపే యాసంగి పంటల ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా రైతులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌజ్ లు అన్ని పూర్తి కాగానే వచ్చే జూన్ నుండి గోదావరి బేసిన్ లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలు అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన నింపడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడ కూడా సాగునీరు అందని భూములు లేకుండా ఉండేలా గోదావరి బేసిన్ లోని నదులు, కాల్వలు అన్నిటిపై చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మానేరు నదిలో నాలుగు నుండి అయిదు, మూలవాగు నదిలో రెండు నుండి మూడు వరకు ఇంకా అవసరం అనుకున్న ప్రతిచోట చెక్ డ్యాం ల నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ముందుగా దీనికి అవసరమయ్యే సర్వే చేయాలని ఆదేశించారు.

దేవాదుల నుండి వరంగల్ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించే విధంగా చూడాలని సీఎం చెప్పారు. వ్యవసాయం తరువాత అతిపెద్ద వ్యాపారంగా చేపల పెంపకం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లు బొడిగే శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సీఎం ఓ అధికారి స్మితాసభర్వాల్, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, జగిత్యాల కలెక్టర్ శరత్  పాల్గొన్నారు.

విద్యుత్ శాఖకు రుణపడి ఉన్నాం

తెలంగాణలో రైతులు రాళ్ళ వాన కష్టాలు పడకుండా యాసంగి పంట సాగును మార్చి 20 లోపే పూర్తయ్యేలా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించిన సమయంలో అక్కడే ఉన్న ట్రాన్స్ సిఎం డీ ప్రభాకర్ రావు మార్చి లోపు యాసంగి పంటలు పూర్తి అయితే మా విద్యుత్ శాఖకు చాలా మేలు అని అన్నారు. వెంటనే సీఎం జోక్యం చేసుకుంటూ… “అవును! ప్రతి చోట మీ పవర్ ఉండాల్సిందేనా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఏమైనా.. మీకు (విద్యుత్ శాఖ) రుణపడి ఉన్నాం” అని సీఎం అన్నారు.

జగిత్యాలలో వంద శాతం భూ రికార్డుల ప్రక్షాళన

తెలంగాణ భూ సర్వే కార్యక్రమంలో భాగంగా  జగిత్యాల జిల్లాలో వంద శాతం భూ సర్వే ను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శరత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. జిల్లాలోని 18 మండలాల్లో 291 గ్రామాల్లోని భూ రికార్డులను సవరించినట్లు తెలిపారు, వివాద రహితమైన 99.18 శాతం భూములను పార్ట్-ఎ భూములుగా నిర్ధారించినట్లు చెప్పారు.

4,52,920 తప్పులను సవరించి రికార్డుల శుద్ధీకరణ చేపట్టినట్లు కలెక్టర్ శరత్ వివరించారు. ఈ సందర్భంగా మల్యాల మండలం రాంపూర్ గ్రామ భూముల వివరాలు, నక్షలు, మ్యాప్ లతో రూపొందించిన చేతిరాత పహాణిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 శాతం పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్ కలెక్టర్ శరత్ ను, రెవిన్యూ అధికారులను అభినందించారు.

Top