You are here
Home > Latest News > మిషన్ కాకతీయ.. తెలంగాణ భాగ్యరేఖ..

మిషన్ కాకతీయ.. తెలంగాణ భాగ్యరేఖ..

Spread the love

ఎంత చెప్పినా.. ఎంత పొగిడినా.. మిషన్ కాకతీయ అమలు అవుతున్న తీరు గురించి తక్కువే అవుతుంది. తలాపున కృష్ణ, గోదావరి లాంటి నదులు పారుతున్నా.. చుక్క నీటికి కూడా వినియోగించుకోకుండా మన నీటిపారుదల వ్యవస్థను ధ్వంసం చేసిన గత పాలకుల దాష్టీకానికి తగిన సమాధానం అన్నట్టే.. మిషన్ కాకతీయ పథకం అమలు అవుతోంది. ఐదువిడతల్లో 46 వేల చెరువులను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కాలపరిమితిగా ఐదు విడతలను నిర్దేశించుకుని.. మూడు విడతలను విజయవంతంగా పూర్తి చేసింది.

ఇప్పుడు.. జనవరి నుంచి నాలుగోదశనూ విజయవంతం చేసేందుకు హరీష్ రావు లాంటి సమర్థుడైన నాయకుడి నేతృత్వంలో పని చేస్తున్న ఇరిగేషన్ శాఖ.. చర్యలు తీసుకుంటోంది. 22 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఈ పథకానికి ఖర్చు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 2015 – 16 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఒక వేయి 783 కోట్ల రూపాయలు కేటాయించింది. 2016 – 17 బడ్జెట్ లో.. 2 వేల కోట్లు ఇచ్చింది. 2017 – 18 ఆర్థిక సంవత్సరంలో ఒకవేయి 973 కోట్ల 74 లక్షల రూపాయలు కేటాయించింది.

ఇంతలా కేటాయించడమే కాదు.. అవసరం అనుకున్నచోట అదనంగా నిధులు కూడా కల్పించి.. చెరువులకు మహర్దశ తీసుకువచ్చింది. ఫలితంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత విజయాలు సాధ్యమయ్యాయి. ఖమ్మంలోని లకారం చెరువు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మురుగును బయటికి పంపేసి సాగర్ జలాలతో నింపారు. 120 ఎకరాల భూమి కబ్జా అయితే.. 90 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కరత్వాడ చెరువు పరిధిలో సాగుకు నీళ్లు ఇచ్చిన చరిత్ర లేదు. అలాంటిది ఈ ఏడాది.. ఐదు వేల ఎకరాల భూమి సాగు అయ్యింది.

మామూలుగా చెరువుల పరిధిలో సాగు 5 లక్షల ఎకరాలు కూడా సాధ్యమా అన్న పరిస్థితి నుంచి.. మిషన్ కాకతీయ విజయవంతంతో 7 లక్షల 10 వేల ఎకరాల భూమి సాగులోకి తెచ్చిందీ.. రాష్ట్ర ప్రభుత్వం. ఇలా.. పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తే.. ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పేందుకు..  మిషన్ కాకతీయ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే.. కేంద్రంతో పాటు.. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ప్రశంసలూ.. ఈ పథకానికి అందుతున్నాయి.

Top