You are here
Home > Latest News > అది ప్ర‌జాగ్ర‌హం కాదు.. వెలుగు ప‌త్రిక ఆగ్ర‌హం

అది ప్ర‌జాగ్ర‌హం కాదు.. వెలుగు ప‌త్రిక ఆగ్ర‌హం

Spread the love

 

అది ప్ర‌జాగ్ర‌హం కాదు.. వెలుగు ప‌త్రిక ఆగ్ర‌హం

ప్ర‌జ‌లు అన‌ని మాట‌ల‌నూ అన్న‌ట్టు రాసేశారు…

వెలుగు ప‌త్రిక బాస్ వివేక్ బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఆ ప‌త్రిక అబ‌ద్ధాల పుట్ట‌గా మారింది. నిత్యం తెరాస ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతోంది. రోజుకు క‌నీసం ఒక్క స్టోరీ అయినా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా రాస్తున్నది. నారాయ‌ణ‌పేట జిల్లా మాగ‌నూర్‌మండ‌లం హిందూపూర్‌లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన మాట నిజం.

కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ఆల్మెట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద వల్ల జురాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో హిందూపూర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కొంత‌మంది మాత్రం త‌మకు ఇళ్లు లేవ‌ని, వాటిని క‌ట్టివ్వాల‌ని మంత్రిని కోరారు. కుక్క‌కు బొక్క దొరికిన‌ట్టు…వెలుగుకు ఈ వార్త దొరికింది.

స్థానికుల‌కు మాట‌ల‌కు మాంచి మ‌సాలా ద‌ట్టించి స్టోరీ వండింది. వాళ్లు కేసీఆర్‌ను తిట్టారని, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని పెద్ద‌పెద్ద ప‌దాలు వాడింది. ఇళ్ల‌పై కేసీఆర్ హామీలు నెర‌వేర‌లేద‌ని అన్నార‌ని పేర్కొంది. నిజానికి మాగ‌నూర్‌లో చాలా ఇళ్లు నిర్మాణ‌ద‌శ‌లో ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రికి ఇళ్లు కేటాయించారు కూడా. ప్ర‌జ‌లు కేసీఆర్‌పై ఆగ్ర‌హం ప్ర‌క‌టించార‌నే వార్త పూర్తి అబ‌ద్ధం. వ‌ర‌ద బాధితుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్న‌ది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజలకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రదేశాలకు తరలించామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు వేగవంతం చేశామ‌ని తెలిపారు. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాల‌ని, నిత్యావసర వస్తువులను అందజేసి పునరావాస చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్‌రావును ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Top