You are here
Home > Latest News > భట్టీ.. సీతక్కా… స్పీకర్ చెప్పింది మీకు అర్థం కాలేదా?

భట్టీ.. సీతక్కా… స్పీకర్ చెప్పింది మీకు అర్థం కాలేదా?

Spread the love

భట్టీ.. సీతక్కాస్పీకర్ చెప్పింది మీకు అర్థం కాలేదా?

  • అనవసరంగా ఎందుకు అవాకులు, చెవాకులు
  • కరోనా ముప్పు పొంచి ఉన్నా.. మీకు సమావేశాలే కావాలా?
  • చర్చలు నిర్వహించినా.. సంతృప్తి పొందకపోతే ఎలా?

మీకు మీరు మేధావులం అని అనుకుంటారో లేక.. పై నుంచి దిగొచ్చిన జనోద్ధారకులుగా భావిస్తారో మాకు అర్థం కాలేదు సీతక్కా. మీకు, మీ నాయకుడు భట్టి విక్రమార్కకు.. మతి ఉందో లేదో అన్నది కూడా జనానికి అర్థం కాలేదు. ఓ వైపు.. కరోనాతో ఇద్దరు శాసనసభ్యులు.. మరికొందరు సభ సిబ్బంది అనారోగ్యం బారిన పడితే.. ముందు జాగ్రత్తగానే సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టంగా వెల్లడించారు.

అంతే కాదు.. సమావేశాల సందర్భంగా.. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని వివరించిన ప్రభుత్వం.. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానాలు కూడా ఇచ్చింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల అరాచకాలు అరికడతామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ విషయంలో.. జీవోను సవరిస్తామని మంత్రి కేటీఆర్ కూడా స్పష్టం చేశారు.

జనానికి ఉపయోగపడే.. ఏ అంశమైనా సరే. అది ప్రతిపక్షం చెప్పినా సరే. ఆచరించి చూపించే సంస్కారం ఉన్న పార్టీ టీఆర్ఎస్. అదే సంస్కారాన్ని ప్రభుత్వ పరంగానూ కొనసాగిస్తోంది కేసీఆర్ సర్కారు. ఇంత చేసినా.. ఇంత చేస్తున్నా.. ఇంకా ప్రభుత్వం పారిపోయిందని.. అదని.. ఇదనీ అంటున్నారంటే.. మీది జ్ఞానమో.. అజ్ఞానమో ఏమని అనుకోవాలి అంటూ ప్రజలు ఆలోచనలో పడ్డారు. దానికి భట్టి, సీతక్క.. ఏమని సమాధానం చెబుతారో మరి.

ఇక.. హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్డు సౌకర్యాలు.. విద్యుత్ సరఫరాలో మెరుగుదల.. పారిశుద్ధ్యం వంటి చర్యలు.. ప్రతిపక్షానికి కనబడవేమో కానీ.. ప్రజలకు మాత్రం కనిపిస్తున్నాయ్. అలాగే.. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేసినా.. విపక్షం అడ్డుకుంటున్న తీరు కూడా జనానికి తెలుస్తోంది. ఈ విషయాలనే పట్టుకుని వేలాడుతున్న భట్టి, సీతక్కతో పాటు.. కాంగ్రెస్ నేతలంతా.. వాస్తవాలు గ్రహించాలని జనం పిలుపునిస్తున్నారు. సంక్షేమానికి సహకరించి.. గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవాలని హితవు పలుకుతున్నారు.

Top