You are here
Home > National News > అవినీతికి చరమగీతం.. ధరణితో రానుంది పెను విప్లవం

అవినీతికి చరమగీతం.. ధరణితో రానుంది పెను విప్లవం

Spread the love

 

అవినీతికి చరమగీతం.. ధరణితో రానుంది పెను విప్లవం


– కొత్త రెవెన్యూ చట్టంతో పాటే వెబ్ సైట్ ప్రారంభం
– రిజిస్ట్రేషన్లు.. వెను వెంటనే ఆటోమేటిక్ మ్యుటేషన్
– త్వరలోనే అమల్లోకి తెలంగాణ సర్కారు సంచలనాత్మక విధానాలు

రెవెన్యూ శాఖను కేసీఆర్ ప్రభుత్వం సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తోంది. ఇప్పటికే.. వీఆర్వోల వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టి.. రికార్డులను తీసుకోవాలంటూ కలెక్టర్లను కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై భూముల రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఏ మాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా.. అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టకుండా.. పూర్తి పారదర్శకంగా ఆన్ లైన్ లోనే ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడమే కాకుండా.. అదే సమయంలో ధరణి పేరుతో కొత్త వెబ్ సైట్ ను రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ నిమిత్తం అందుబాటులోకి తేవాలని కసరత్తు చేస్తోంది.

ఇన్నాళ్లూ… భూములు, భవనాల వంటి సమాచారం కావాలంటే.. విపరీతమైన ప్రహసనం ఉండేది. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో.. తహసీల్దార్ల కార్యాలయాల్లో ప్రజలు తిరిగీ తిరిగీ అలసిపోయేవారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 21 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే మ్యూటేషన్ తో సహా పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇకపై.. రాష్ట్రంలోని ఇతర గ్రామీణ తహసీల్దార్ల కార్యాలయాలకూ ప్రక్రియను విస్తరిస్తారు.

ఈ 21 కార్యాలయాల్లో జరుగుతున్న ప్రక్రియలో అవినీతి రహితంగా జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు పూర్తి స్థాయిలో పారదర్శక సేవలు అందించేందుకు సిద్ధమైంది. కేవలం ఆధార్ నంబర్ కొట్టగానే.. అతని పేరుపై ఉన్న భూముల వివరాలు కనిపించే సౌకర్యం రానుంది. ఫలితంగా.. భూ అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుంది. ఇన్నాళ్లూ వేళ్లూనుకుని ఉన్న అవినీతికి చరమగీతం పాడినట్టు అవుతుంది. అందుకే.. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం మంచికే కట్టుబడింది.

అధికారంలోకి రాకముందు తెలంగాణను సాధించి చూపిన కేసీఆర్.. పగ్గాలు చేపట్టాక అదే ఉద్యమ స్ఫూర్తిని పరిపాలనలో కొనసాగిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో వాయు వేగాన్ని ప్రదర్శించారు. సాగులో సంచలనాలు సృష్టించేలా రైతులను కదిలించారు. ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. తనకే సాధ్యమైన రీతిలో పారదర్శక పాలన సాగిస్తూ పదే పదే అధికారాన్ని అందుకుంటున్నారు. రాజకీయాలు వేరు.. నీతి వంతమైన పరిపాలన వేరు.. అని తన చేతలతో నిరూపించుకుంటున్నారు.

ఇప్పుడు అదే బాటలో.. ధరణి వెబ్ సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇది తమకు మేలు చేస్తుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను మనసారా స్వాగతిస్తున్నారు.

Top