You are here
Home > Latest News > తెలంగాణకు ఇది నిజంగా శుభవార్తే!

తెలంగాణకు ఇది నిజంగా శుభవార్తే!

Spread the love

తెలంగాణకు ఇది నిజంగా శుభవార్తే!

  • ఆందోళనలకు చరమ గీతం పాడే దశలో తెలంగాణ
  • ప్రభుత్వ, ప్రజల జాగ్రత్తలతో కరోనాకు అంతిమయాత్రకు సిద్ధం
  • త్వరలోనే కరోనా రహిత తెలంగాణ సాధన దిశగా అడుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ప్రజలు ఆందోళనలు తగ్గించే దిశగా.. నిఖార్సైన వాస్తవాన్ని వెల్లడించారు. ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం.. రాష్ట్రంలో కరోనా విస్తృతి, దాని పరిధి, రోగుల పరిస్థితి గురించి నిజానిజాలను పంచుకున్నారు. దేవుడి దయతో.. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో తెలంగాణ.. కరోనా రహిత రాష్ట్రంగా అవతరించబోతోందని చెప్పారు. కానీ.. అది సాధించాలంటే మరింత కఠినంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ.. 25 వేల 937 మందిని అనుమానితులుగా గుర్తించి.. పరీక్షలు చేయించామని చెప్పారు.

5 వేల 746 బృందాలను ఏర్పాటు చేశామని.. నిరంతరం ఆ బృంద సభ్యులు.. క్వారంటైన్ లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఏప్రిల్ 7 నాటికి.. ఈ 25 వేల 937 మంది పరిశీలన పూర్తవుతుందని.. కరోనా పాజిటివ్ ఉన్న వారికి కూడా చికిత్స పూర్తయితే.. నెగటివ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా.. మన ముఖ్యమంత్రి మన మేలు కోరి మరిన్ని కీలక సూచనలు చేశారు. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి కారణంగా.. 59 వేల మందికి కరోనా వ్యాపించిన ఉదాహరణను చెప్పి.. సమాజాన్ని మేల్కొలిపేందుకు యత్నించారు. అలాంటి పరిస్థితి మనకు రావొద్దని ఆకాంక్షించారు. మన దేశంలో ఉన్న వైద్య సదుపాయాలు చాలా తక్కువ అని చెప్పిన కేసీఆర్.. అలాంటి అత్యయిక స్థితి వస్తే.. ప్రజలు ఇబ్బంది పడతారని ఆవేదన చెందారు.

అలాగే.. ప్రజలు పాటిస్తున్న సంయమనాన్ని కూడా కేసీఆర్ ప్రశంసించారు. చాలా వరకు ప్రజలు సహకరిస్తున్నారని ఆనందించారు. ఇలాగే సహకరించి తెలంగాణను కరోనా రహితంగా మార్చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఇంతటి కష్టకాలంలోనూ.. ప్రజల కోసం ఇంతగా పరితపించే ముఖ్యమంత్రిగా.. కేసీఆర్ మరోసారి మాటలతో కాకుండా చేతలతో నిరూపించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల పరిపాలకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Top