You are here
Home > Latest News > జీవన్ రెడ్డి… ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది

జీవన్ రెడ్డి… ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది

Spread the love
  • జీవన్ రెడ్డి… ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది
  • తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావు జాగ్రత్త
  • కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరిందో నీకు తెల్వదా?
  • పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తన్ని తరిమేస్తారు

ఎమ్మెల్సీ అయిపోగానే ఈ దేశానికి రాజయినట్టు కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు కదా… అలా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యాడు. ఇక.. ఆగుతలేడు.. ఎగిరెగిరి పడుతున్నడు. జీవన్ రెడ్డి.. కాస్త భూమి మీద ఉండు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నదట… నీలాంటిదే. అందుకే.. కళ్లను కాస్త భూమి మీదికి చూస్తూ మాట్లాడు. త్రిశంకుస్వర్గం ఉన్నట్టుగా ఊహించుకోకు. నీ గతమేందో? నీ వర్తమానం ఏందో? నీ భవిష్యత్తు ఏందో తెలంగాణ ప్రజానికానికి బాగా తెలుసు. నువ్వేమీ పెద్ద తోపువు కాదు. తెలంగాణ ప్రదాతవు కావు. తెలంగాణ ఉద్యమ నేతవూ కాదు. పోనీ.. తెలంగాణకు నీవల్ల ఏమన్నా ఒరిగిందా అంటే అదీ లేదు.

ఇప్పుడు నువ్వు తెలంగాణ గురించి తెగ కపట ప్రేమ ఒలకబోస్తున్నావా? నువ్వు దశాబ్దాలుగా కాలం వెళ్లదీస్తున్న నీ పార్టీ కాంగ్రెస్ తెలంగాణను 40 ఏళ్ల పాటు పాలించి ఏం చేసింది. ఏపాటి అభివృద్ధి చేసింది చూపించు. ఇదిగో… దీన్ని కాంగ్రెస్ పార్టీయే డెవలప్ చేసింది. కాంగ్రెస్ పార్టీయే కట్టించింది అని ఒక్కటి చెప్పు. పోనీ… నువ్వు తెలంగాణ కోసం ఏం చేశావో చెప్పు. నోరు పెకలదు నీకు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ అయినా… నీలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా తెలంగాణను నాశనం నాలుగు పాళ్లు చేశారు తప్పితే… తెలంగాణకు మీరు చేసిందేమీ లేదు. ఆ విషయం లోకమంతా తెలుసు. ఇప్పుడు నువ్వు తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తే ఎట్లా సామి. నిన్ను తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకుంటున్నవా? మీ పార్టీకి గత ఐదేళ్లుగా ఎటువంటి గతి పడుతున్నదో చూస్తలేవా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను పాతరేస్తున్నరు. ఎందుకు.. ఇదిగో నీలాంటి నాయకుల వల్లే.

మీరు 40 ఏళ్లలో ఎన్నిసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మీ 40 ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎంత కేటాయించారో? ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో? ఎన్నింటిని నెరవేర్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు శుద్ధపూసల్లా మాట్లాడకండి జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ… తెలంగాణ ప్రభుత్వం కేంద్రం వద్ద చాలాసార్లు మొరపెట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా కూడా టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు. అయినా కూడా కేంద్రం దాటవేత ధోరణితో ఉంది. పోనీ.. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే మీరు.. ఎందుకు కేంద్రంతో మాట్లాడరు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు. అది మీ బాధ్యత కాదా? కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడగకూడదా? మీకు ఆ హక్కు లేదా? మీరు అడగరు. అడిగిన వాళ్లపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తారా? జీవన్ రెడ్డి.. కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు మధ్యలో పుల్లలు పెట్టకుండా ఉంటే చాలు.

Top