You are here
Home > Uncategorized > కాళేశ్వరంకు జాతీయ హోదా కుదరదట

కాళేశ్వరంకు జాతీయ హోదా కుదరదట

Spread the love

కేంద్రం కాడి పారేసింది

  • మరోసారి తెలంగాణకు ఘోర అన్యాయం
  • కాళేశ్వరంకు జాతీయ హోదా కుదరదట
  • మనకే రూల్స్ వేరే రాష్ట్రాలకు జాన్తా నై
  • మళ్లీ కేంద్రంపై పోరాటం తప్పదు

అనుకున్నట్టే అయింది! మరోసారి తెలంగాణకు కేంద్రం ద్రోహం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోట్లో మట్టికొట్టింది. రైతులకు అన్యాయం చేసింది. ఎన్నో ఏళ్ల ఆశలు ఆవిరయ్యాయి. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష, చిన్నచూపు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని కేంద్ర జలశక్తి తెలిపింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరట. ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలట. ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు ఇలాంటి అనుమతులు ఏవీ లేకున్నా హోదా ఇచ్చి పారేశారు. తెలంగాణ అనగానే కొర్రీలు పెడుతున్నారు. ఎలా ఇవ్వాలని కాక ఎలా ఇవ్వకుండా ఆపడానికి అన్ని దారులు వెతికారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని అనేకసార్లు కోరినా కేంద్రం ఇవ్వలేదు. కర్ణాటకలోని అప్పర్‌భద్ర, మధ్యప్రదేశ్‌లోని కెన్‌-బెత్వా, ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రాష్ట్ర ప్రాజెక్టులను తొక్కిపెట్టింది. నిధుల కేటాయింపులో, జాతీయ సంస్థల మంజూరులో, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించడంలో.. ప్రతి అంశంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నది. ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ర్టాలను విస్మరిస్తూ బీజేపీ పాలిత రాష్ర్టాలకు పట్టం గడుతున్నది. ఒక రాష్ట్రం అత్యధిక జనాభాకు ప్రయోజనం చేకూర్చేలా బహుళ ప్రయోజనాలతో కూడిన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా కేంద్రం జాతీయ హోదాను ప్రకటిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుంది.

జాతీయ హోదా ఇవ్వటానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఈ ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేదు. ప్రాజెక్టు ఆలోచన పురుడుపోసుకొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకొన్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విన్నవించినా ఫలితం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడంతోపాటుగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇచ్చే అవకాశమున్నా కేంద్రం నిరాకరిస్తున్నది.

మనకు లేదని చెప్పి.. ఇతర రాష్ట్రాలకు హోదా
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వటంలో బీజేపీ సర్కారు దేశప్రయోజనాలను గాలికొదిలేసి పక్కా రాజకీయాలు మొదలుపెట్టిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 నేషనల్‌ ప్రాజెక్టులున్నాయి. ఇందులో బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదా ఇచ్చినవి పోలవరం, కెన్‌-బెట్వా. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని చెప్తూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌- మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కెన్‌-బెట్వా రివర్‌ లింక్‌ ప్రాజెక్టుకు నేషనల్‌ స్టేటస్‌ ఇచ్చారు. ఆ సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే విషయాన్ని తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీనిపై అప్పటి జల్‌శక్తి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండదు. ఏ ప్రాజెక్టుకు నేషనల్‌ స్టేటస్‌ను ఇచ్చేది లేదు’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొంత కాలానికే కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ప్రకటించింది. రోజూ మీడియా హెడ్‌లైన్స్‌లో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలే రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రం వివక్షపై ఇప్పటికీ నోరు మెదుపలేదు.
ఇటీవల కేంద్రం జాతీయ హోదా పొందిన ప్రాజెక్టులు

పోలవరం ప్రాజెక్టు

వాటర్‌ డైవర్షన్‌ స్కీమ్‌.
194 టీఎంసీల సామర్థ్యం.
జలవిద్యుత్తు ఉత్పత్తి 960 మెగావాట్లు.
నిర్మాణ వ్యయం రూ.55,548 కోట్లు.
ఆయకట్టు 6 లక్షల ఎకరాల కంటే తక్కువ.
ప్రాజెక్టుపై ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాలతో అంతర్రాష్ట్ర వివాదాలు
‘కెన్‌-బెత్వా’ రివల్‌ లింక్‌

లబ్ధి చేకూరేది యూపీ-మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు.
రూ. 39,317 కోట్లతో నదుల అనుసంధానం.
ఆయకట్టు 23 లక్షల ఎకరాలు.
62 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం.
103 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి.
ఇంకా పూర్తి అనుమతులు రాలేదు.
అప్పర్‌ భద్ర

40 టీఎంసీల ఎత్తిపోతల నిర్మాణ వ్యయం 21,473 కోట్లు.
ఆయకట్టు 8 లక్షల ఎకరాలు.
సీడబ్ల్యూసీ నుంచి కొన్ని అనుమతులు పొందాల్సి ఉన్నది.
ఏపీతో అంతర్రాష్ట్ర జలవివాదం.

Top