You are here
Home > Latest News > ఓట్లడగమని ధైర్యంగా ప్రకటించింది సీఎం కేసీఆర్‌ ఒక్కరే – మంత్రి కేటీఆర్..

ఓట్లడగమని ధైర్యంగా ప్రకటించింది సీఎం కేసీఆర్‌ ఒక్కరే – మంత్రి కేటీఆర్..

Spread the love

ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్ప ఈ దేశంలో మరెవరూ లేరని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌ మియాపూర్‌లో రిజర్వాయర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో రూ.1900 కోట్లతో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్లు అధికారం ఇచ్చినా కాంగ్రెస్‌ పార్టీ తాగునీటి సమస్యను పరిష్కరించలేదని అన్నారు

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే హైదరాబాద్‌లో దాదాపు 90శాతం తాగునీటి సమస్యను పరిష్కరించామని అన్నారు. ఇంకా ఉన్న 10శాతం కూడా పూర్తిచేసి రాష్ట్రం మొత్తంలో ఆడబిడ్డలెవరూ బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చే అవసరం లేకుండా ఇంటింటికీ నల్లా పెట్టించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

నగరంలోని ప్రతి మారుమూల కాలనీలోనూ మంచి రోడ్లు, నీళ్లు, కనీస వసతులు కల్పించాలనే సంకల్పంతోనే తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. దశాబ్దాల కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెబుతోందన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముతామా ? అని కాంగ్రెస్‌ గత పాలనను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం నిజాయతీగా పనిచేసుకుంటూ ముందుకెళ్లోందన్నారు.

Top