You are here
Home > Telangana > కొత్త జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం

కొత్త జోనల్ వ్యవస్థకు కేబినెట్ ఆమోదం

Spread the love

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. రెండు గంటల పాటూ జరిగిన సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండు అంశాలను ఆమోదించింది. టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, టీజీవో సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలను ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించారు.

తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉండనున్నాయి. స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేయనున్నారు. అటు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదువుతారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉండనుంది.

అటు రాష్ట్ర రైతులకు జీవిత బీమా కల్పించే అంశంపై కూడా కేబినెట్‌ చర్చించింది. ఈ పథకం ప్రకారం రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏండ్ల వయస్సున్న ప్రతీ రైతుకు 5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. LIC ద్వారా బీమాను అమలు చేస్తారు. ప్రతీ రైతుకు 2 వేల 271 రూపాయల చొప్పున ప్రతీ ఏడాది ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుంది. ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. అటు ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు.

అటు వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 65 సంవత్సాలకు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటూ ఇతర సిబ్బందిని నియమించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.

జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రిని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.

Top