You are here
Home > Latest News > అసలు నిజం అదే.. తెలంగాణలో బీజేపీ బలమెంత…రెండంటే రెండే సీట్లు

అసలు నిజం అదే.. తెలంగాణలో బీజేపీ బలమెంత…రెండంటే రెండే సీట్లు

Spread the love

అసలు నిజం అదే..

తెలంగాణలో బీజేపీ బలమెంత…రెండంటే రెండే సీట్లు. అదీ మొన్నటి దుబ్బాక గాలివాటు గెలుపు కలుపుకుంటే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ గెలిచింది ఒకే ఒక్క సీటు. రాష్ట్రంలో చాలా చోట్ల  బీజేపీ ఉనికే లేదు..సరిగ్గా చెప్పాలంటే..గ్రామాలు, చిన్నస్థాయి పట్టణాల్లో బీజేపీ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అలాంటి పార్టీ..తెలంగాణ వ్యాప్తంగా తిరుగులేని బలమున్న టీఆర్ఎస్ తో పోరాడుతుందట. రాష్ట్రంలో బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్యేనట అసలు పోటీ. బీజేపీ సీనియర్ నేత మురలీదర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

పాపం తెలంగాణ  బీజేపీ నేతలతో పోలిస్తే..మురలీధర్ రావు చేసే వ్యాఖ్యలు కాస్త నయం. ఆయన కూడా వాస్తవానికి దగ్గరగా మాట్లాడకపోయినప్పటికీ…కొంతలో కొంత నయం. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలయితే..జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ను కూలదోసి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని బీరాలు పలికారు. తర్వాత 2023లో అధికారంలోకి వస్తామని చెప్పడం ప్రారంభించారు. వారితో పోలిస్తే మురలీధర్ రావు టీఆర్ఎస్ తో పోరాడతామని మాత్రమే వ్యాఖ్యానించడం చూస్తే..వాస్తవ పరిస్థితిని కొంత ఆయన గ్రహించారని భావించవచ్చు. అయితే నిజంగా రాష్ట్రంలో బీజేపీ బలమెంత, ప్రజల ఆదరణ పొందడానికి ఏమేం చేయాలి వంటివాటిపై ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుండేది.

కానీ మిగిలిన విషయాల్లో ఆయన కూడా తెలంగాణ బీజేపీ నేతలకు తీసిపోని విధంగా బీరాలు పలికారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి సరైన అభ్యర్ధే దొరకడం లేదు. కానీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, అందుకే అభ్యర్ధిని ప్రకటించడం ఆలస్యమవుతోందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇక కేసీఆర్ వల్లనే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు పదవులొచ్చాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మురలీధర్ రావు విమర్శలు గుప్పించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజముందని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అంతర్గతంగా తెలుసు. కేసీఆర్ పోరాడడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయింది. ఉద్యమకాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీజేపీ నేతలకు పదవులు దక్కాయి. దీనికి కారణం తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఏర్పాటే.

 

Top