You are here
Home > Latest News > సొంత ఇంటిని చక్కదిద్దుకోండి

సొంత ఇంటిని చక్కదిద్దుకోండి

Spread the love
  • సొంత ఇంటిని చక్కదిద్దుకోండి

రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్న పార్టీ పరిస్థితి చూసి కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓ పక్క పీసీసీ అధ్యక్ష పదవిలో ఎవరిని నియమించాలో తెలియక ఢిల్లీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఎవ్వరికయినా జాలి కలగక మానదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలిన పార్టీయేనా ఇది అన్న సందేహం కూడా కలుగుతుంది.

అయితే చేసిన తప్పుల నుంచి ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు కాంగ్రెస్ నేతలు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే ఆ పార్టీలో ఏ ఒక్కనేతకీ సొంతఇంటిని చక్కదిద్దుకోవాలన్న తాపత్రయం లేదు. ఏదో మొక్కుబడిగా ఉన్నట్టుగా రాజకీయాలు చేస్తుంటారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షులు కావాలని ఉత్సాహం చూపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి…సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..ఇలా ఒకరని కాదు..నేతలంతా ఈసురోమంటున్నారు.

ఇక ఆ నేతలందరికీ తెలిసిందల్లా ఒక్కటే ప్రభుత్వాన్ని విమర్శించడం. ప్రజల్లో తిరిగి, పార్టీ ప్రాధమ్యాలు వివరించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం మీద కాకుండా…ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఆచన కుటుంబాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం మీదే వారి ద్రుష్టి. ఇలా సీఎంను విమర్శిస్తే…వార్తల్లో నిలుస్తామన్నది వారి ఉద్దేశం. అందుకే కాంగ్రెస్ పరిస్థితి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఢిల్లీని అధికార కేంద్రంగా మార్చి..రాష్ట్రాల హక్కులను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ ది. ఆ పార్టీ సుదీర్ఘ పాలనలో దేశానికి కలిగిన నష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్రాలకు రాజ్యాంగ బద్దంగా ఉండే హక్కులే అమలు చేయకుండా…అనేక కుట్రలు చేసింది కాంగ్రెస్. ఆ పార్టీ నేతలు ఇప్పుడు గ్రామపంచాయతీల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. స్థానిక పాలనకు పెద్ద పీట వేశారు కేసీఆర్.

ఆరేల్ల పాలనా కాలంలో గ్రామాలు ఇంతకుముందెన్నడూ లేని రీతిలో అభివ్రుద్ధి కావడానికి కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన విశేష అధికారాలే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గ్రామాల అభివ్రుద్ది కోసం క్రుషి చేస్తూనే..పంచాయతీలకు అనేక అధికారాలు ఇచ్చారు కేసీఆర్. తెలంగాణలో ఏ పల్లెనడిగినా ఈ విషయం అంగీకరిస్తుంది. గ్రామీణ భారతమే అసలైన భారతం అన్న గాంధీజీ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పల్లెల్లో సంక్షేమ పథకాలు అమలుచేసి, ప్రజలు స్వయంసమ్రుద్ధి సాధించేలా ముందుకు నడిపారు. అటువంటి పాలన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధ్వాన్నపు పాలనగా కనిపించడానికి కారణం రాజకీయాలే. సీఎం కేసీఆర్ ను తిట్టడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందాలన్న తాపత్రయం తప్ప..ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఆ పార్టీ నేతలకు లేదు.

ఆరేల్ల కాలంలో పంచాయతీలు ఎంతో బలోపేతమయ్యాయి. గ్రామాల్లో అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల కారణంగా టీఆర్ఎస్ పార్టీ ఎంతో బలోపేతమయింది. ఉద్యమ సమయంలో కన్నా ఎక్కువగా పార్టీ ఆరేల్లకాలంలో గ్రామీణ ప్రజల మెప్పు పొందింది. ఇది సహించలేకే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పాలనపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. దొంగదీక్షలతో నాటకమాడుతున్నారు.

Top