You are here
Home > Latest News > కక్కుర్తి పడకండి.. కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టకండి

కక్కుర్తి పడకండి.. కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టకండి

Spread the love

కక్కుర్తి పడకండి.. కష్టకాలంలో జనాన్ని ఇబ్బంది పెట్టకండి

  • నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మడంపై సీఎం ఆగ్రహం
  • చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక చేసిన కేసీఆర్
  • నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టులు పెడతామన్న సీఎం

కరోనా నియంత్రణకు ఓ వైపు కఠిన చర్యలు పాటిస్తూనే.. మరోవైపు మానవత్వాన్ని చాటుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సందు చూసుకుని నిత్యావసరాలను ఎక్కువ ధరలకు అమ్మి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అధిక ధరలకు విక్రయించే వారిని గుర్తించి ఆ వ్యాపారాల లైసెన్స్ రద్దు చేస్తామని.. శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెడతామని కూడా హెచ్చరించారు.

రాత్రి 7 గంటలకు మొదలు కానున్న కర్ఫ్యూ.. ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని.. మిగతా సమయాల్లో నిత్యావసరాల దుకాణాలు తెరిచే ఉంటాయని సీఎం చెప్పారు. ప్రజలు ఎవరూ గాబరా పడకుండా.. ఈ వేళల్లోనే తమకు అవసరమైన సరుకులు తెచ్చుకోవాలని.. అది కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ పదే పదే చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు.

మార్కెట్ల గురించి ఈ వెసులుబాటును ప్రజలకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజారోగ్య పరిరక్షణ పరంగా.. కరోనా నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోందని.. మనం ఈ దశలోనే ఆ వ్యాధిని అరికట్టకుంటే తప్పు చేసినవాళ్లం అవుతామని స్పష్టం చేశారు. ప్రజలంతా ఎవరి ఇళ్లలోనే వాళ్లు పరిమితం కావాలని.. ఏ మాత్రం సమస్య వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆదుకునేందుకు వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, పారిశుద్ధ్య విభాగాలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాబట్టి.. ఇలాంటి తరుణంలో జనాలు సాధ్యమైనంత సమయం ఇంటికే పరిమితమైతే.. కరోనాను తరిమికొట్టవచ్చు అన్న విషయాన్ని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన సమయాల్లోనే.. అత్యవసరమైతేనే బయటికి రావాలి. కరోనా నియంత్రణలో భాగంగా జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలి.

Top