You are here
Home > Latest News > కార్మికులారా.. మీ యూనియన్ నేతల్ని నిలదీయండి

కార్మికులారా.. మీ యూనియన్ నేతల్ని నిలదీయండి

Spread the love

కార్మికులారా..  మీ యూనియన్​ నేతల్ని నిలదీయండి

‘‘యూనియన్​ నేతలు చెప్పే మాయామాటలు నమ్మి కార్మికులు ఆగం కావద్దు.. దయచేసి మీ కుటుంబాల్ని రోడ్డున పడేసుకోవద్దు..”అని తెలంగాణ కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి అధినేతగా సీఎం కేసీఆర్​ చాలా రోజుల కిందటే విజ్ఞప్తి చేశారు. ఆరోజు సీఎం మాటల్ని మీరు, మీ యూనియన్​ నేతలు పెద్ద జోక్​లాగా తీసుకున్నరు. ఇల్లీగల్​గా సమ్మె చేస్తే ఇక్కడేకాదు.. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల్ని డ్యూటీల్లోకి తీసుకోదు. కార్మిక పక్షపాతిగా సీఎం కేసీఆర్​ ఇంకో మార్గం చూపెట్టిన్రు.. లేబర్​ కోర్టు తీర్పు వచ్చేదాకా ఆర్టీసీ ఉద్యోగులు సంయమనం పాటించాలని ఎండీ ద్వారా చెప్పించిండు.

అయినాసరే, కార్మికులు మళ్లీ యూనియన్​ నేతల చెప్పుడు మాటలు విని.. ఎక్కడికక్కడ డిపోలకు పోయి డ్యూటీల్లో చేరుతామని గొడవలు చేస్తున్నరు. మీ కోసం మంచి చెయ్యాలనుకునే ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ తిడుతున్నరు. సమ్మెకు ఎవరు బాధ్యులో, కార్మికుల బతుకుల్ని రోడ్డున పడేసింది ఎవరో మీ మనస్సాక్షికి, మీ కుటుంబ సభ్యులకు కచ్చితంగా తెలుసు. యూనియన్లకు భయపడుతూ, వాళ్లు చెప్పినట్లు ఆడినంత కాలం కార్మికుల పరిస్థితి మారదుగాక  మారదు. కార్మికులారా.. అసలెందుకు సమ్మె చేశారు?ఎందుకు విరమించారు? ఒక్కసారైనా మీ యూనియన్ల నేతల్ని గల్లాపట్టి నిలదీసి అడగండి.

జేఏసీ పేరుతో అశ్వద్థామరెడ్డి అండ్​ కో ఆడుతున్న బ్లాక్​మెయిల్​ రాజకీయ నాటకంలో మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్న తీరును ఇకనైనా గుర్తించడి. డిపోల దగ్గర గలాటా చేస్తే ఏమైతది? శాంతిభద్రతలకు విఘాతం కల్పించినట్లయితది కాబట్టి పోలీసులు అరెస్టు చేస్తరు. దాంతోటి మీ సమస్యలు పరిష్కారం కావు. సమ్మె పిలుపునకు వ్యతిరేకంగా, యూనియన్​ నేతలపై కార్మికులే తిరబడాల్సిన టైమొచ్చింది. అవసరమైతే అశ్వద్థామరెడ్డి అండ్ కో మీద న్యాయాపోరాటానికి దిగండి. బ్లాక్​మెయిలర్స్​ పీడను వదిలించడానికి మీరు చేసే ప్రయత్నంలో తెలంగాణ సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది. అలా కాదు.. మేం ఎప్పటికీ యూనియన్​ నేతల చెప్పుడు మాటలే వింటామంటే మాత్రం మీది అరణ్యరోదనే అవుతుంది. ఇప్పటికైనా జరుగుతున్న మోసాన్ని, కుట్రలను కార్మికులు గుర్తిస్తే మంచింది.

Top