You are here
Home > Latest News > జెడ్పీల‌కు నిధులు ఇవ్వాల్సింది కేంద్రం

జెడ్పీల‌కు నిధులు ఇవ్వాల్సింది కేంద్రం

Spread the love
  • జెడ్పీల‌కు నిధులు ఇవ్వాల్సింది కేంద్రం
  • నిందించాల్సింది దానినే
  • రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అంటే ఏం లాభం ?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌ల‌కు అడ్డాగా మారిన వెలుగు ప‌త్రిక‌.. ఈ రోజు ఎడిష‌న్‌లో జెడ్పీటీసీల‌కు, ఎంపీటీసీలకు నిధులు అంద‌డం లేద‌ని రాసింది. ఈ విష‌యంలో కొంత నిజం ఉంది. అయితే పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ప్ర‌కారం వీరికి నిధులు రావాల్సింది ఢిల్లీ నుంచి. రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రాంటు మాత్ర‌మే చెల్లిస్తుంది. కేంద్రం నుంచి డ‌బ్బు రాక‌పోతే రాష్ట్రం చేసేదేమీ ఉండ‌దు. వెలుగు ప‌త్రిక ఆ విష‌యాన్ని తెలివిగా దాచిపెట్టిన త‌ప్పంతా కేసీఆర్ ప్ర‌భుత్వంపైకి నూకేసింది.

నిధుల్లేక, చేసేందుకు ఏమీ లేక జిల్లా, మండల పరిషత్‌లు ఇబ్బందిప‌డుతున్న మాట వాస్త‌వమే. ఎలాంటి నిధులూ లేక మొక్కుబడిగా మారిపోయామని, అసలు పదవుల్లో ఉన్నది ఎందుకో అర్థం కావడం లేదని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాపోతున్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని జెడ్పీ, మండల పరిషత్ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీస్తున్నారు. 2015 నుంచీ అమల్లో ఉన్న 14వ కేంద్ర ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు కేటాయిస్తోంది. గతంలో ఇచ్చినట్టుగా జిల్లా, మండల పరిషత్ లకు నిధులు కేటాయించేలా కేంద్రంపై కేసీఆర్ ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తున్నా ఫ‌లితం ఉండ‌టం లేదు.

గతంలో స్థానిక సంస్థలకు బీఆర్జీఎఫ్ (బ్యాక్ వర్డ్ రీజియన్ ఫండ్)లో భాగంగా నిధులు వస్తుండేవి. ఇప్పుడు అవి కూడా రావటం లేదు. వివిధ జిల్లాల్లో మైనింగ్  సెస్​ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మొదట్లో ఈ సొమ్ము నేరుగా స్థానిక సంస్థలకు వెళుతుండేది. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక.. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు మళ్లించారు. ఆ నిధులను జిల్లా, మండల పరిషత్ లకు ఇవ్వ‌డం లేద‌ని వెలుగు రాసింది ప‌చ్చి అబ‌ద్ధం. ప్ర‌భుత్వం స్థానిక సంస్థ‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు ఉండ‌టం మోడీ ప్ర‌భుత్వానికి ఇష్టం లేదు కాబ‌ట్టి జెడ్పీల‌కు నిధులు రావ‌డం లేదు. అస‌లు విష‌యం ఇది. ఆర్టీసీ స‌మ్మెపై ఊగిపోతున్న‌బీజేపీ నాయ‌కులు ఇలాంటి విష‌యంలో వారి ఢిల్లీబాసుల‌ను నిల‌దీయ‌రు. అంత సీన్ వారికి లేదు కూడా.

 

 

Top