You are here
Home > Latest News > ముఖ్యమంత్రి వర్యా.. మీకు ధన్యవాదాలు….

ముఖ్యమంత్రి వర్యా.. మీకు ధన్యవాదాలు….

Spread the love

మాతృభాష మృత భాష కాబోతోందని కొందరన్నారు. తెలుగు వెలుగులు తగ్గిపోతున్నాయని ఇంకొందరు అన్నారు. అసలు తెలుగే లేకుండా పోతోందని మరి కొందరు వ్యాఖ్యానించారు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా..  ఎవరికి వారు తోచిన మాటలు మాట్లాడేసి.. మమ అనిపించుకుని వెళ్లిపోయారు. కానీ.. తనకే సాధ్యమైన కార్యసాధనతో.. తనకే సాధ్యమైన నమ్మకపు విలువలతో.. తెలుగు మహాసభలను అంతా తానై విజయవంతం చేశారు.. మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

తెలుగు వెలుగులు ప్రసరించాలంటే.. సంబురాలు ఒక్కటే సరిపోదని.. ఇంకా చాలా కీలకమైన చర్యలు అవసరమని ఆయన వాస్తవాన్ని గుర్తించారు కాబట్టే.. ప్రక్రియ కొనసాగుతుందని.. సంబురాల ముగింపు సందర్భంగా స్పష్టం చేయడమే కాదు.. అందుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రకటించారు. వచ్చే నెలలో భాషావేత్తల సదస్సు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి.. తెలుగును బతికిస్తామన్న మాట చెప్పడం.. సమస్త తెలుగు ప్రపంచానికి తేనెలొలుకు తీపి కబురు కాక మరింకేం అవుతుంది.

సభలు నిర్వహించడమే కాదు. సంస్కారవంతంగా.. సంప్రదాయబద్ధంగా నిర్వహించడంలో.. తన నైపుణ్యాన్ని, తన పాండిత్యాన్ని ముఖ్యమంత్రి ఈ సభలతో నిరూపించుకున్నారు. తెలుగంటే.. రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే యాస మాత్రమే అని ఇన్నాళ్లూ నమ్మబలికిన వారి నుంచి.. తెలంగాణ తెలుగు మాగాణపు రుచులను అద్భుతంగా పంచి మైమరపింపజేశారు. గురువుకు పాదాభివందనంతో సభలు మొదలు పెట్టి.. సంస్కారంలో తెలంగాణ మేటితనాన్ని నిరూపించారు. తెలుగంటే.. మాటల వరకే పరిమితం కాదు.. పద్యం, గద్యం కూడా అంటూ స్వయంగా పద్యాలు పాడి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అతిథులను సత్కరిస్తూ.. ప్రాంతాలుగా విడిపోయినా.. మనుషులుగా అంతా ఒక్కటే అన్న సత్యాన్ని పొరుగు రాష్ట్రం వారితో కూడా చెప్పించడంలో విజయం సాధించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ సున్నితత్వాన్ని.. తెలంగాణ సహృదయతను.. తెలంగాణ తెలుగువెలుగులను సమస్త ప్రపంచానికి చాటడంలో కృతకృత్యులైన మన ముఖ్యమంత్రి ధన్యజీవులయ్యారు. తెలుగువారిగా.. తెలంగాణవారిగా మనలనూ ధన్యులను చేశారు. అందుకే.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాష్ట్ర ప్రజానీకం.. హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ.. ఆయన శతవత్సరాలూ ఇలాగే తెలుగు వెలుగులు ప్రసరింపజేయాలని కోరుకుంటోంది.

Top