You are here
Home > Latest News > కలలు కంటూనే ఉండండి… అలాగే బతకండి

కలలు కంటూనే ఉండండి… అలాగే బతకండి

Spread the love

– ఎన్నికలపై కాంగ్రెస్ నేతల పగటి కలలు

– జనంలో బలం లేకున్నా గెలుపుపై అతి విశ్వాసం

– బొక్కాబోర్లా పడడం ఖాయమని శ్రేణుల హెచ్చరికలు

కాంగ్రెస్ నేతల అతి విశ్వాసం హద్దులు దాటుతోంది. ఓ వైపు ప్రజలు టీఆర్ఎస్ నే మరోసారి ఆశీర్వదిస్తామని చెబుతున్నా… ముఖ్యమంత్రి సభలకు లక్షల్లో జనాలు హాజరవుతున్నా… కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం పట్టడం లేదు. వారికే సాధ్యమైన అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల చూపు కాంగ్రెస్ వైపే ఉందంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా… ఇతర నేతలంతా ప్రగల్భాలు పలుకుతున్నారు.

చోటా మోటా లీడర్లను పార్టీలో చేర్చుకుంటూ ఆ వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకే దిక్కు లేని ఆ పార్టీ.. ఉన్న నేతలు కూడా పార్టీలో కొనసాగుతారో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ… ఇలా మాట్లాడ్డం, ఇలా వ్యవహరించడం అతి కాకపోతే ఇంకేంటని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతే కాదు. ఉత్తమ్ చెప్పినట్టు ప్రజల చూపు కాంగ్రెస్ వైపే ఉందని ప్రజలు వెటకారంగా చెబుతున్నారు.

ఎందుకంటే… ఎంత దారుణంగా కాంగ్రెస్ ఓడిపోబోతోందో చూద్దామని ఎదురు చూస్తున్నట్టు ఓటర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్… ఇలా కలలు కంటూనే ఉండాలని, వారికి అది తప్ప ప్రజామోద రాజకీయం చేతకాదని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు… తెలంగాణ ఏర్పాటులో ఆలస్యంతో వందల మందిని బలి తీసుకున్న ఆ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

అన్ని వర్గాలను సమానంగా చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను మరోసారి తీసుకువచ్చి కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామని, తగిన శాస్తి చేస్తామని కుండ బద్ధలు కొడుతున్నారు.

Top